If nature could .. (Telugu)
PoetryKishore Siga
What could happen if sky was able to hear? What if water could roar? Nourish the poem penned down by Kishore Siga, as he paints a possibility where Nature is equipped with human senses.
గగనానికి వినికిడి ఉంటే,
ఈ ఏకాంత మౌన రోదనలు విని,
దాని వర్షాశ్రువులతో ఈ ప్రపంచాన్ని ముంచేసేది కదా...
అగ్నికి చూపు ఉంటే,
స్మృతులతో దహనం అవుతున్న ఈ వర్తమానాన్ని చూసి,
తన ప్రళయాగ్ని నర్తన తాండవంతో ఈ లోకాన్ని మసి చేసేది కదా...
నీటికి అరిచే శక్తి ఉంటే,
ఈ అక్షాశ్రువుల ఘోషణ యొక్క శబ్ద తరంగాలతో,
ఈ ప్రపంచం మార్మోగిపోయేది కదా..
పవనానికి పదాల అల్లిక వచ్చి ఉంటే,
నిరీక్షణ భారం మొయ్యలేక స్తంభించి పోతానని విలపిస్తున్న
ఈ శ్వాస యొక్క సందేశాన్ని ఆ దేవుడికి రాసి ఇచ్చేది కదా..
ధరిత్రికి ధర్మ విచక్షణ జ్ఞానం ఉండి ఉంటే,
ఈ అనైతిక పరిణామాన్ని ఓర్వలేక,
తన క్రోధ కంపనాలతో ముక్కలైపోయేది కదా...
ఈ పంచభూతాలకు కరుణ ఉండి ఉంటే,
ఈ కథలో జీవితాలని ముంచేస్తున్న
కన్నీటి ప్రవాహాన్ని అడ్డుకునేది కదా..