నాన్నా

Vineela Manchikatla

Dive into the concluding part of this gripping father-daughter story and find out the answers to the whys and hows that the first part of this story left you with

'నాన్నా.. వెళ్దామా?' నా మందుల చిట్టి సంచిలో పెడుతూ అడిగాను.

ఈ మూడేళ్ళలో ఏనాడూ అనుకోలేదు మళ్ళీ ఇలాంటి ఒక రోజు వస్తుందని. తిరిగి ఈ ఇంటికి వస్తానని. మళ్ళీ నాన్నతో ఇలా ఉండగలనని. ఆ రోజు నాన్నతో మనసు విప్పి మాట్లాడాక అనిపించింది ఈ పనేదో అప్పుడే చేసుంటే ఇన్నాళ్లు నాన్నకి దూరం అయ్యేదానిని కాదు కదా అని.

ఇంట్లో అన్ని సర్దుకున్నాయి కాబట్టి నా ప్రసవం కూడా ఇక్కడే జరుగుతున్నందుకు చెప్పలేనంత సంతోషంలో ఉన్నాను. ఇంత సంతోషం లో ఉండగా ఆదిత్యకి ఇక దిగులు ఎందుకుంటుంది? అందుకే ఆ వెధవ అక్కడ పని ఉంది అని నన్ను ఇక్కడ వదిలేసి ఊరికి వెళ్ళిపోయాడు. సరేలే! ఇలా అయినా నేను నాన్న ప్రేమ పొందకుండా కోల్పోయిన సమయం అంత తిరిగి నాకు లభిస్తున్నందుకు ఆనందంగా గడిపేస్తున్నాను.

'సరే ఉమా.. నేను తీసుకెళ్తానులే తనని హాస్పిటల్ కి. నువ్వు పడుకో,' అని నాన్న అమ్మకి చెద్దరు కప్పి నా చేతిలోని సంచి తీస్కుని స్కూటర్ మొదలుపెట్టారు. స్కూటర్ స్టార్ట్ చేయడానికి గట్టిగా మూడు-నాలుగు కిక్ లు కొడుతుంటే నా పాత రోజులు గుర్తొచ్చాయి.

ఏంటి నాన్న.. ఇంకా రిపేర్ చేయించలేదు?' అని నవ్వాను.

'అదేంటి అమ్మ అలా అంటావ్? రిపేర్ అవసరమేం ఉంది. నేనేమన్నా ముసలివాడిని అయ్యానా?' అని అనగానే, ఆరో కిక్ లో స్కూటర్ స్టార్ట్ అయింది, 'చూసావా?' ఏదో గొప్ప విషయం సాధించినవాడి లాగా ఛాతి విరిచి నిల్చున్నారు. నవ్వుకుంటూ స్కూటర్ ఎక్కాను.

ఆయన వెనక కూర్చొని ఆ వీధులన్ని తిరుగుతుంటే పాత రోజులు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు స్కూటర్ పై నుండి కింద పడతానని భయంతో ఆయన్ని ఎంత గట్టిగా పట్టుకునేదాన్నో అలానే మళ్ళీ పట్టుకునే అవకాశం వచ్చినందుకు సంతోషం ఆపుకోలేకపోయా, 'నాన్న, ఒకసారి ఆగు.'

'ఏం అయింది, అమ్మా?' వెంటనే అడిగారు నాన్న స్కూటర్ ఆపేసి.

'అక్కడ పుల్ల ఐస్ తిందామా?' అని అడిగాను. నా చిన్నప్పుడు నుంచి అక్కడే పుల్ల ఐస్ అమ్ముతున్న ఆ బండి వాడిని చూసి.

'వద్దమ్మా, తిన్నాక డాక్టర్ గారికి తెలిస్తే ఒప్పుకోరేమో. ఎందుకులే? కావాలంటే ఇంకెప్పుడైన తినిపిస్తాను.'

'నాన్న, ప్లీజ్ నాన్న! ఒక్కటి చాలు.'

'వద్దని చెప్పాను కదా!' అని చిన్నగా మందలిస్తూ స్కూటర్ పోనిచ్చారు.

హాస్పిటల్ కి వెళ్ళగానే ఒక వార్డ్ బాయ్ నాన్నని పలకరించారు, 'ఏంటి సర్, ఈరోజు వచ్చారు? డాక్టర్ గారు ఈరోజు హాస్పిటల్ కి రారు. మీకు తెలిసిందే కదా..'

'తెలుసు కృష్ణయ్య. ఇదిగో నేను నా కూతురి కోసం వచ్చానులే. డాక్టర్ లక్ష్మి గారిని కనుక్కొని చెప్తావా, ఆవిడా చూస్తారో లేదో?'

'ఇప్పుడే వస్తాను,' అని ఆ వార్డ్ బాయ్ వెళ్ళిపోయాడు.

'ఏంటి నాన్న అతను అంత పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు?' అని అడిగాను, నెమ్మదిగా పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంటూ, 'ఎవరు ఆ డాక్టర్?'

'నువ్వు మూడేళ్ళ క్రితం ఆదిత్యని ఇంటికి తీసుకురాకపోయుంటే ఈరోజు నిన్ను ఆ డాక్టర్ హాస్పిటల్ కి తీస్కొచేవాడు అమ్మ..' అని నాన్న అనగానే అర్ధం అయింది. 'ఓహ్! వినోద్ గారా!' అని తల దించాను, ఏంటో ఎక్కడో వినోద్ గారిని మోసం చేశాననే భావనతో.

'నువ్వెందుకు చిన్నబుచ్చుకున్నావ్ అమ్మ? ఏం బాధపడకు. నిజం చెప్పాలంటే నేనే ఆదిత్యని నమ్మాల్సింది. నా పెంపకాన్ని నమ్మాల్సింది. నా ఎంపికను కాదన్నావనే కోపంతో రెండు సంవత్సరాలు గడిపాను కానీ..' నాన్న మళ్ళీ దాని గురించి మాట్లాడుతుంటే, ఏం జరిగినా సరే ఆ గతాన్ని ఎవరు మార్చలేరు అని బాధపడ్డాను, '..అదేంటో ఇంత సమయం పట్టింది నాకు నా పెంపకం తప్పు కాదు అని అర్ధం చేసుకోడానికి. ఈరోజు మీ జంటని చూస్తే మాత్రం ఆరోజు నువ్వు చేసిందే సరైంది అని కూడా అనిపిస్తూ ఉంటుంది,' అని నా తలను గుండెకు హత్తుకున్నారు.

'ఇక వాళ్ళ నాన్న, నేను వియ్యంకులం కాలేకపోయినా.. ఎప్పటినుంచో మంచి స్నేహితులం కదా.. పెళ్లి టైం కి అలా అయినా, ఆ స్నేహం అలానే కొనసాగింది. కానీ ఆయన ఈ మధ్యనే కాలం చేసారు కాబట్టి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను వాడిని.'

'సర్, లక్ష్మి గారు రమ్మంటున్నారు,' వార్డ్ బాయ్ వచ్చి నాన్నని పిలిచాడు. నాన్న నా చేయి పట్టుకుని లేపి తీసుకెళ్లారు. 'నమస్తే మేడం,' అని ఆవిడని పలకరించి కూర్చున్నాం.

ఆవిడ అన్నీ పరిశీలించాక, 'బిడ్డ బానే ఉన్నట్టు తెలుస్తుంది. తల్లి కూడా బానే ఉంది. ఏం పర్లేదు. మంచి గాలికి తిరిగేలా చూస్కోండి. వాకింగ్ కి వెళ్ళండి. అంతే. మందులు వంటివి కూడా ఏం అక్కర్లేదులే ఈ టైం లో,' అంటూ నా రిపోర్ట్ లు నాకు ఇచ్చేసింది, 'మీరేమన్న అడగాలా?'

ఎప్పటినుంచో ఉన్న చిన్న భయంతో నేను అడిగాను, 'మేడం నాకు నార్మల్ డెలివరీ అవుతుందా? లేదా ఆపరేషన్ చేస్తారా?'

'అది ఇప్పుడే చెప్పలేం అమ్మ. నేను ఇచ్చిన డైట్ ఫాలో అవ్వండి. వ్యాయామం చేయండి. వాకింగ్ చేయండి. చాలావరకు నార్మల్ అవుతుంది. కానీ అన్ని విషయాలు మన చేతిలో ఉండవు కాబట్టి ఆపరేషన్ చేయాల్సి వస్తే చేయాల్సిందే.' నాన్న చేయిని గట్టిగా పట్టుకున్నాను. 'భయపడకు అమ్మా. ఏమున్నా మీకు లాస్ట్ చెకప్ సమయంలో అంటే ఒక రెండు వారాల ముందు చెప్పేస్తాం. టెన్షన్ ఏం లేదు. కాకపోతే ఒకటే సమస్య. నార్మల్ డెలివరీ అయితే మన హాస్పిటల్ లోనే చేస్తాం కానీ.. ఆపరేషన్ అయితే మీ టౌన్ కి వెళ్లాల్సిందే. మన ఊర్లో ఇంకా ఆపరేషన్ చేసేంత ఎక్విప్మెంట్ లేదు.'

'సరే మేడం. అయితే నేను నార్మల్ అయ్యేలా చూసుకుంటాను,' అని అన్నాను.

'గుడ్, అలా ధైర్యం గా ఉండు చాలు. ఇంకేమన్నా అడగాలా?'

'అవును ఒక విషయం ఉంది,' అని నాన్న అడగబోయారు.

'చెప్పండి'

'అది..'

'పర్లేదు ఏదైనా అడగండి.. ఇలాంటి టైం లో ఎటువంటి సందేహాలు ఉంచుకోకూడదు..'

'తను పుల్ల ఐస్ తినొచ్చా మేడం?'


'రెండు పుల్ల ఐస్ లు ఇవ్వు బాబు,' అని నాన్న పొద్దున అడిగిన బండి వద్దే ఆపి కొన్నారు.

తియ్యటి పుల్ల-ఐస్ నోట్లో పెట్టుకొని ఆస్వాదిస్తూ నాన్నకి కృతజ్ఞతలు చెప్పాను. ఇదిగో ఇది కూడా తీస్కో అని రెండోది కూడా నాకే ఇచ్చారు.

'నాకొద్దు నాన్న. మీరు తినండి,' అని అంటే 'నీకు ఎవరు ఇస్తున్నారు అమ్మా? నా మనుమడికి ఇది. వాడి కోసం కూడా నువ్వే తినాలి కదా! అందుకే నీకు ఇస్తున్నాను,' అని అనగానే నవ్వుకుంటూ ఆ రెండోది కూడా లాగించేసాను.

ఇంటికి చేరుకోగానే అమ్మకి హాస్పిటల్ లో ఆవిడా చెప్పిందంతా చెప్పాము. ఆపరేషన్ విషయం తప్పితే అమ్మకి ఇక దేనిమీద భయం లేదు. నాన్న కూడా ఏం కాదులే అని ధైర్యం ఇచ్చి ఆయన రూమ్ కి వెళ్లి ఆఫీస్ పనిలో మునిగిపోయారు.

పగలు లేచిన వెంటనే నాకోసం అన్ని రెడీగా ఉండేవి. నాన్నతో పగలు వాకింగ్ కి వెళ్లి అక్కడ నాన్నకి తెలిసిన వాళ్ళది గర్భవతుల కోసం వ్యాయామం చేపించే ఒక అమ్మ దగ్గర చేర్పించారు. అది అయిపోయేదాకా నాతో పాటే ఉండేవాడు. ఇద్దరం తిరిగి ఇంటికి వచ్చి కలిసే తినేవాళ్ళం. ఇక ఆయన ఆఫీస్ కి వెళ్ళాక నాకు ఇంట్లో అమ్మతో లేదా పక్కింటి వాళ్ళతో సమయం గడిచేది. తిరిగి సాయంత్రం వచ్చేవారు. రాగానే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని వచ్చి కడుపులోని బిడ్డతో కొద్దిసేపు మాట్లాడేవారు. మళ్ళీ మామిడి తోటలోకి వాకింగ్ కి వెళ్ళేవాళ్ళం. ప్రతి సాయంత్రం పుల్ల-ఐస్ లేదంటే పుల్లటి మామిడికాయలు కొనేవారు. అవి కూడా రెండు. ఒకటి నాకు ఒకటి నా బిడ్డకు . మళ్ళీ ఇంటికి వచ్చి తినేసి పడుకునేవాళ్ళం.

అప్పుడప్పుడు నాకు సరిగ్గా నిద్ర పట్టకపోతే, ఆయనకి ఎలా తెలిసేదో కానీ, ‘నిద్ర వస్తలేదా, తల్లి?’ అంటూ నా మంచంపై కూర్చొని నా తలని ఆయన ఒడిలో పెట్టుకుని జుట్టుని నిమురుతూ నిద్రపుచ్చేవారు. నేను ఒక బిడ్డకు తల్లిని అవుతున్నాను అనే అనుభూతి కంటే ఆయనకి మళ్ళీ కూతురిని అవుతున్నాను అని అనిపించేది.

చూస్తుండగానే ఒక నెల అయిపొయింది. అందరి జాగ్రత్తలు కూడా పెరిగాయి.

బెడ్ పై నుంచి కిందికి దిగనిస్తే ఒట్టు. తినడానికి ఏది అడిగినా నా దగ్గరికే వచ్చేది. ఇక సరైన టైం లో స్వాతికి కూడా సెలవులు పడ్డాయి. అది నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. అన్ని నా దగ్గరికే తెచ్చిచ్చేది. అమ్మని అడగడమే ఆలస్యం, వంటగదిలోకి పరుగులు పెట్టి చేసిపెట్టేది ఏమి అడిగినా.

ఇక నాన్న అయితే వీళ్ళిద్దరితో పోటీ పడి మరి ప్రేమించేవాడు. హాస్పిటల్ కి వెళ్ళాలన్నా, వాకింగ్ కి వెళ్లాలన్నా ఆయన ఉండాల్సిందే. నేను ఆయనతో వెళ్లాల్సిందే. ఒక రోజు అమ్మ తో వెళ్ళాను అని ఎంత పెద్ద యుద్ధం జరిగిందో అమ్మతో. ఇక అమ్మ కూడా తనకి ఎందుకులే అని ఆ బాధ్యతంతా నాన్నకే ఇచ్చేసింది. ఆయన అక్కడ కూడా ఆగలేదు. నాతో సరిగ్గా సమయం గడపలేకపోతున్నారని ఆఫీస్ ఫైల్స్ అన్ని ఇంటికే తెచ్చుకొని పనిచేసేవారు.

ఇక తొమ్మిదో నెల కూడా పడిపోయింది.

మరో మూడు వారాలు అయితే ప్రసవం ఉండొచ్చు అని లక్ష్మి గారు పోయిన వారం అన్నారు. ఈ వారం చెకప్ రోజు వచ్చేసింది.

పెద్ద ఆఫీసర్ ఎవరో ఆఫీస్ కి వస్తే పొద్దున్నే నాన్న మీటింగ్ కి వెళ్లారు. ఆయన కోసం ఎదురుచూస్తూ వాకిట్లో కూర్చున్నాను. నాన్న స్కూటర్ మీద వేగంగా వచ్చారు, '5 నిముషాలు అమ్మా.. హాస్పిటల్ కి వెళదాం,' అని గబగబా ఆయన ఫైల్స్ తీస్కొని ఆయన రూమ్ లో పెట్టి ఒచ్చేసారు.

'నాన్న మెల్లగా.. ఆయాసపడకు. ముందు కూర్చో,' అని అన్నాను.

'ఏం లేదు లేమ్మా.. ఆల్రెడీ లేట్ అయింది,' అని అన్నారు.

సరే అని స్కూటర్ ఎక్కి మాట్లాడుతూ వెళ్తున్నాం.

'ఇంత ఎందుకు నాన్నా కష్టపడటం? ఆఫీస్ లోనే పని చేసుకోవొచ్చు కదా! చూడు ఎలా చెమటలు పడ్తున్నాయో,' అంటూ నా చీర కొంగుతో ఆయన నుదురు తుడిచాను.

'ఏంటమ్మ అలా అంటావ్? అయినా నా కూతురిని ప్రేమించే చివరి అవకాశాల్లో ఏది కూడా నేను వదులుకోవాలి అనుకోవట్లేదు.'

'ఏంటి నాన్న అలా అంటున్నవ్?'

'ఎందుకంటే తరువాతంతా నా మనుమడి తల్లిని ప్రేమించాలి కదా..' ఆయన భుజం మీద ఒక్కటిచ్చాను నవ్వుతూ.

'అంటే నీకు కూతురి కంటే మనుమడు ఎక్కువ అయిపోయాడా?'

ఆయన నవ్వుతూ జవాబిచ్చారు, 'మీ నానమ్మ.. అంటే మా అమ్మ. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నపుడూ నిన్ను ఎలా చూస్కునేదో తెలుసా? అసలు నేను కొడుకునని కూడా గుర్తొచ్చేది కాదు ఆ మహా తల్లికి. ఎప్పుడు చూడు కడుపులో బిడ్డ బాగుండాలి అనేది. పాపం నువ్వు పుట్టడానికి రెండు వారాల ముందు పోయింది. నువ్వు పుట్టగానే అందరు తనే మళ్ళీ పుట్టింది అన్నారు.'

'అందుకని? మీ అమ్మ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావా, నీ మనుమడిని అడ్డం పెట్టుకొని?' అని అడిగాను.

'బానే పట్టేసావ్ తల్లి..' అని నా తల నిమిరాడు.

హాస్పిటల్ లో అడుగు పెట్టగానే డాక్టర్ వినోద్ ఎదురొచ్చారు. 'ఏంటి అంకుల్ ఇలా వచ్చారు? ఏదైనా ఉంటె నేనే వచ్చేవాడిని కదా! మీరు ఎందుకు శ్రమ తీసుకోవడం,' అని నాన్నతో అన్నారు.

'లేదు బాబు. అమ్మాయి కోసం వచ్చాను. ఈరోజే చివరి చెకప్.'

'ఓహ్! ఎలా ఉంది శశి గారు ఆరోగ్యం?' నన్ను పలకరించారు.

'పర్లేదు బాగుందండి,' అని జవాబిచ్చాను.

'అయినా అంకుల్.. హాస్పిటల్ మనది. డాక్టర్ నే ఇంటికి పంపేవాడిని మీరు కబురు పెట్టుంటే,' అంత జరిగినా ఇంకా మన వాళ్ళు అన్నట్టుగా గౌరవం ఇస్తున్నారు కాబట్టి నాన్నకి ఈయనంటే మంచి అభిప్రాయం ఉంది.

'పర్లేదు బాబు. లక్ష్మిగారు ఉన్నారా?'

'ఉన్నారు అంకుల్, వెళ్ళండి. మళ్ళీ ఏం అవసరం ఉన్నా నాకు చెప్పండి, మీరు ఎందుకు అటు ఇటు తిరిగి కష్టపడటం,' అని సెలవు తీసుకున్నారు.

ఇక డాక్టర్ ని కలవడానికి వెళ్ళాం.

ఆవిడ అన్ని పరిశీలించి, 'గుడ్ అంతా బానే ఉంది. మీరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు.'

నాన్న అడిగారు, 'డాక్టర్ గారు.. అది.. నార్మల్ ఆ? ఆపరేషన్ ఆ? అని చెప్తానన్నారు.'

'నిజానికి అందుకోసమే పిలిపించాను. శశి.. నీకు ఆపరేషన్ చేయాలమ్మ..'

'అదేంటి డాక్టర్? అన్ని మీరు చెప్పినట్టే చేశాను కదా!'

'అవును మేడం. అన్ని చేసింది. మేము కూడా తనని మీరు చెప్పినదానికి విరుద్ధంగా వెళ్లనివ్వలేదు,' నాన్న నన్ను సమర్ధించారు.

'అవును అండి. కానీ కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. ఇంకా రెండు వారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే చెప్తున్నా.. మీరు మానసికంగా ప్రిపేర్ అవ్వండి ఆపరేషన్ కి. ఆ టౌన్ లో మాకు తెలిసిన హాస్పిటల్ కూడా ఉంది. మీకు కూడా అక్కడి ఇంటికి దగ్గరగా ఉంటది కాబట్టి, అక్కడే మీకు ఆపరేషన్ చేయిద్దాం.'

'నేను చేయించుకోను' అని నాన్నని ఆవిడని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాను.

'నేను అమ్మాయి తో మాట్లాడుతాను,' అని నాన్న ఆవిడతో చెప్పి బయటకి వచ్చేసారు.

ఇంట్లో ఈ విషయం తెలిసింది. అందరు ఆపరేషన్ చేయించుకోమని చెప్తుంటే నేను ఒక్కదాన్నే వద్దు అంటూ కూర్చున్నాను. ఆరోజు అందరు నా మొండితనాన్ని చూసారు. ఆ గొడవ వాతావరణంలోనే ఆరోజు నిద్రాహారాలు ముగిసాయి.

అలా ఒక రెండు రోజులు వాళ్ళు బతిమిలాడటం నేను కుదరదు అనడం. అందరు మౌనంగానే ఉన్నారు కానీ, నాన్నకే సహనం నశిస్తున్నట్టు ఉండే. కానీ చాలా ఓర్చుకున్నారు.  ఆ మరుసటి రోజు వాకింగ్ చేస్తుండగా నాన్నే అడిగారు, 'ఏమైందమ్మ? ఎందుకు వద్దంటున్నావ్?'

'మీకు అర్ధం కాదులే నాన్న!'

'నాకు అర్ధం కాకుండా ఎలా ఉంటుంది అమ్మ?'

ఒక క్షణం ఆగి ఆయన నిజంగానే అర్ధం చేసుకుంటారని నమ్మి జవాబిచ్చాను, 'నేను బిడ్డ కి జన్మనిస్తుంటే, నాకు ఆదిత్య కంటే ముందు మీరు నా పక్కన ఉండటం ముఖ్యం నాన్న. మీరు పక్కన ఉన్నారని నా కన్నులు చూస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. ఆపరేషన్ అంటే మత్తు ఇస్తారు, మిమ్మల్ని చూడలేను, కనీసం స్పృశించలేను. మిమ్మల్ని ఏంటి నా బిడ్డని కూడా చూసుకోలేను. అంతెందుకు నా బిడ్డని లోకంలోకి తెచ్చే ఆ నొప్పిని కూడా అనుభవించే భాగ్యం దక్కదు నాకు. వద్దు నాన్న నాకు అలాంటి ప్రసవం.'

'అలా కాదు తల్లి..' నాన్న నన్ను అర్ధం చేసుకోలేదని అర్థమైంది.

'లేదు నాన్న! నేను చెప్పేసాను అంతే! ఇక ఈ విషయంలో మాత్రం నేను మారేది లేదు,' అని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాను.

మరో రెండో రోజులు ముగిసాయి. వచ్చే వారంలో నా ప్రసవం.

నాన్న వెళ్లి డాక్టర్ లక్ష్మిని కలిసి వచ్చారు. నేను అదే మొండితనంతో నట్టింట్లో కూర్చొని ఉన్నాను. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అమ్మ, నేను గొడవ పడుతూనే ఉన్నాం ఆ విషయంపై.

స్వాతి ఏమో ఎవరి వైపు నిలబడాలో తెలీక అలా చూస్తూ ఉండిపోయింది. నాన్న డాక్టర్ ని కలిసేసి వచ్చారు. నా దగ్గరికి వచ్చి, 'అమ్మా! వెళదాం అమ్మా. ఎందుకు ఇలా చేస్తున్నావ్?' అని బుజ్జగించడానికి ప్రయత్నించారు.

'నీకు ఒకసారి చెప్తే అర్ధం కాదా నాన్నా?' అని గట్టిగా అరిచేసాను. వారం నుంచి ఆయన పడుతున్న ఓపిక కూడా ఆ క్షణం నశించిపోయింది. 

'ఏంటి బతిమిలాడుతుంటే ఎక్కువ చేస్తున్నావా?' అని ఆయన కూడా అంతే కోపంతో తిరిగి అరిచారు, 'ఒక బిడ్డకి తల్లి అయ్యుండి ఈ మొండితనం పనికి రాదు తల్లి..' అని గట్టిగానే వారించారు.

కానీ నేను పట్టించుకోనట్టు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. అంతే ఆయన కోపం నషాళానికి చేరింది.

వెళ్లి స్కూటర్ స్టార్ట్ చేసారు. ఒక్క కిక్ కె స్టార్ట్ అయింది అంటే ఎంత కోపంగా ఉన్నారో తెలిసింది. అయినా కూడా ఈసారి నేను తగ్గాలి అనుకోలేదు, ఆయన పట్టుదలే నాకు కూడా వచ్చిందని చూపెట్టాలనుకున్నాను.

ఒక 30 నిమిషాల తరువాత రిక్షాతో పాటు వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మపై, చెల్లిపై అరిచారు వెంటనే బట్టలు సర్దుకొమ్మని. వాళ్ళు భయం భయంగా వెళ్లి సర్దుకొని వచ్చారు.

'నీకు బొట్టు పెట్టి చెప్పాలా?' అని నా కళ్ళలోకి చూస్తూ అన్నారు.

'నువ్వు కాళ్ళు పట్టుకొని అడిగినా నేను వినను నాన్న!' అని ఎదురు తిరిగాను.

వెంటనే నా గదిలోకి వెళ్లి చేతికి అందిన గుడ్డలు సంచిలో వేసుకొని బయటకి వచ్చారు. నా చేతిని పట్టుకొని తీసుకెళ్తుండగా, చేయి విడిపించుకొని ఆయన వైపు కోపంగా చూస్తూ నిల్చున్నాను.

'చిన్న పిల్లలా చేయకు శశి! డాక్టర్ ఏం అన్నారో తెలీదా? ప్రాణాలు పోతాయని అంది కదా! నీ ప్రాణాలు కాకపోయినా బిడ్డ గురించి ఆలోచించు,' అని మళ్ళీ కోపగించుకున్నారు.

'నాన్న అర్ధం చేస్కో. అప్పుడు నా కోరిక కాదన్నావ్. ఈరోజు కూడా అలానే అంటున్నావ్. ఎందుకు నాన్న ఇలా?' కనీసం ఈసారైనా అర్ధం చేసుకుంటారని అనుకున్నాను కానీ లేదు ఆయన మౌనంగా తీక్షణంగా నా వైపు చూసేసరికి మారరు అని అర్ధం అయింది.

ఇక నేను కూడా కోపంగా అరిచేసాను, 'అయినా నా బిడ్డ నా ఇష్టం! పెంచుకుంటాను లేదా చంపుకుంటాను. ఏం చేస్కుంటావ్?'

మరో క్షణం ఆలస్యం చేయకుండా ఆయన గట్టిగా నా చెంప చెళ్లుమనిపించారు.

అది మొదటిసారి ఆయన నా మీద చేయి చేసుకోడం. అంతే నా నోటిలోంచి మాట రాలేదు. అమ్మ, చెల్లి కూడా అలా మూగవాళ్ళై నిల్చున్నారు. 'రండి!' అంటూ నా చేయి గుంజుకొని రిక్షా ఎక్కించారు. రిక్షా రైల్వే స్టేషన్ ముందు ఆగింది. నేను మౌనంగానే ఉన్నాను. కానీ కదల్లేదు. ఆయన నా వైపు అదే కోపంతో అలా చూస్తూనే దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటూ కోపాన్ని అణుచుకుంటూ మళ్ళీ నా చెయ్యిపట్టుకొని తీసుకెళ్లారు ప్లాట్ఫారం మీదకి. అక్కడ మా కోసమే ఎదురుచూస్తున్నట్టుగా ఆ ట్రైన్ ఆగి ఉన్నది.

నాన్న మూడు టికెట్లు తీసి చెల్లి చేతిలో పెట్టారు. 'ముగ్గురు జాగ్రత్త. మీరు అక్కడ దిగగానే బావగారు వస్తారు. నేను ఆల్రెడీ చెప్పి ఉంచాను,' అని చెల్లితో అన్నారు.

అమ్మ, చెల్లి ట్రైన్ ఎక్కేసారు. నేనక్కడ అలానే శిలగా నిల్చున్నాను. నాన్న  నా వద్దకి మెల్లగా వచ్చారు. నెమ్మదిగా ఆయన చేతులను నా చెంపలపై ఉంచారు, నేను తోసేసాను. 'అమ్మ అర్ధం చేస్కో! నీకోసమే కదా..' మళ్ళీ అదే మాట.

'చాలు నాన్నా! ఆపేసేయ్..' ఇక మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను, 'ఆపేయి నాన్న.. నాకోసమే కదా అని మాత్రం అనకు. నీకు తెలుసా నాన్న? నీకు ఎప్పుడు అనిపించి ఉండదు కానీ నువ్వు చాలా సెల్ఫిష్..' ఆయన నా నుంచి ఆ మాట వస్తుంది అనుకోలేదు. మూగవాడై నిల్చున్నాడు. చాలా అంటే చాలా సెల్ఫిష్ నాన్న నువ్వు. చాలా స్వార్థపరుడివి. ఎప్పుడు నీ సంతోషమే చూస్కున్నావ్!'

'కానీ అమ్మా.. నువ్ బాగుంటావ్ అని..'

'నాన్న నన్ను మాట్లాడినియ్యు. నా సంతోషంలో నీ సంతోషం వెతుక్కోడానికి తప్పితే నా సంతోషానికి ఎప్పుడైనా ప్రాధాన్యం ఇచ్చావా? నీకు సంతోషాన్నిచ్చే నా సంతోషాలే నువ్వు నాకు ఇవ్వాలనుకుంటావని నాకు అర్ధం అవుతుంది. లేదంటే అసలు నా సంతోషంతో పని లేదు కదా నాన్న నీకు. నేను గర్భవితిని కాబట్టే నన్ను రమ్మన్నావ్. నీ మనుమడి కోసమే నన్ను రమ్మన్నావ్. అదే నేను గొడ్రాలు అయ్యుంటే.. అసలు గుర్తొచ్చేదానినా? ఇక చాలు నాన్న. ఒక విషయం గుర్తుంచుకో నాన్న.. నాకు కనుక బిడ్డ పుడితే.. నువ్వు దానిని చూడటానికి వస్తే మాత్రం ఇప్పుడే చెప్తున్నా.. నీకు నీ బిడ్డ ఉండదు!' అని చెప్పేసి ట్రైన్ డోర్ వైపు నడిచాను. ఆయన మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

'ఇంకొక్క మాట నాన్న. నా ఖర్మ కాలి నాకు నీకు ఇంకో జన్మ అంటూ ఉంటె.. నీకు పుణ్యం ఉంటది, ప్లీజ్ నాకు నాన్నలా మాత్రం పుట్టకు,' అని వెళ్ళిపోయాను.

నా కిటికీ ఉన్న సీట్ వైపు నేను కూర్చున్నాను. నాన్న వీపు మాత్రమే కనబడుతుంది. ఆయన మెల్లగా నడవడం మొదలుపెట్టారు. ఇక్కడ ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. నాకు ఆయన నీడ కూడా చూడాలని లేక ఆకాశం వైపు చూసాను. రైల్వే స్టేషన్ పైకప్పుకి వేలాడుతున్న గడియారం వైపు నా దృష్టి మళ్లింది. సమయం ఏడున్నర.

కాళ్ళు వణకడం మొదలయ్యాయి. చేతులకు చెమటలు పట్టాయి. ఒక్కసారిగా ట్రైన్ హార్న్ శబ్దం చెవులను కబళించివేసింది. బయటకి చూస్తే నాన్న వేసే ప్రతి అడుగుకి నా గుండె వేగం పెరుగుతుంది. ఆయన అడుగులు తడబడుతున్నాయి అని గ్రహించేలోపే ఆయన కింద కూలిపోయాడు.

'నాన్నా!' అంటూ గట్టిగా అరిచాను. కంపార్ట్మెంట్ అంత ఉలిక్కి పడింది.

తొమ్మిది నెలల గర్భిణిని అని కూడా పట్టించుకోకుండా నడుస్తున్న ట్రైన్ లోంచి దూకేసాను. అడుగులు తడబడ్డాయి కానీ, నన్ను నేను సంభాళించుకోగలిగాను. ఇప్పటివరకు అంత కోప్పడ్డావు కదా.. అదేంటి మళ్ళీ నాన్న కోసం ఇంతలా పరిగెడుతున్నావు అని మనసు ప్రశ్నిస్తుంది. నేను పట్టించుకోలేదు. పరిగెడుతూ ఉన్నాను. నాన్నా! నాన్నా! అని అరుస్తూ పరిగెడుతూనే ఉన్నాను.

చుట్టూ జనం చేరారు. అందరిని పక్కకి తోసుకుంటూ ఆయన్ని చూడటానికి  వెళ్ళాను.


'శశి..' ఆదిత్య వచ్చాడు నా రూమ్ లోకి, '..నిన్ను పిలుస్తున్నారు రా.' మెల్లగా నా చేతులు పట్టుకుని నడిపించాడు.

చుట్టూ జనం చేరారు. అందరిని పక్కకి తోసుకుంటూ ఆయన్ని చూడటానికి వెళ్ళాను. ఆయన లేడు.

ఆయన ఫోటో మాత్రమే ఉంది. పూలదండతో అలంకరించి,  దీపాల మధ్య వెలుగుతూ ఉంది నాన్న ఫోటో. పక్కకి చూస్తే తెల్ల చీర కట్టుకున్న మా అమ్మ ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు అయిపోయాయి అయినా తన బాధ కొంచెం కూడా తగ్గలేదు అని తెలుస్తోంది.

స్వాతి ఒక మూలన కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉంది. 'దండం పెట్టుకోమ్మ..' అని ఓ పెద్దావిడ నా భుజంపై చేయి వేయగానే నా కాళ్ళు ఆగలేవు. కూలబడిపోయాను.

'నాన్నా!' అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చాను. అమ్మ, స్వాతి భయపడి నన్ను ఆపారు, ఆదిత్య నన్ను హతుక్కున్నాడు.. నా చేతులు పట్టుకున్నాడు.. కానీ నన్ను నేను ఎలా సమర్ధించుకోగలను? నాన్నని చంపేసాను అన్న బాధ ఎలా పోగొట్టుకోవాలో తెలీదే.. ఏడవటం తప్ప ఏమి చేయగలను?

జీవితమంతా ఏడిస్తే తిరిగి వస్తాడు అని ఎవరైనా చెప్తే మరో ఏడు జన్మలు కూడా నాన్న కోసం ఏడవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఎవరు కూడా అలాంటి నమ్మకం ఇవ్వలేకపోతున్నారు. నాకే ఎందుకు ఇలా? అసలు నాకు ఆరోజు ఏమైంది?


ఇదే ఇంట్లో సంతోషంగా రెండు నెలలు ఎలా గడిచాయో తెలీదు, కానీ బాధతో నిండిన ఈ 10 రోజులు మాత్రం కొన్ని యుగాలుగా గడిచాయి.

ఈరోజు దశదిన కర్మ జరుపుతున్నాం. ఎన్ని కర్మలు జరిగినా ఆ ఆత్మకు శాంతి దొరుకుతుందా అని నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. మొన్న ఒకసారి, 'పిట్ట ముట్టింది కదా అక్క.. బావ ఆత్మకి శాంతి దొరికింది. ఏం కాదులే!' అని పెద్దమామ అమ్మకి నచ్చజెప్తున్నాడు. కానీ ఎలా చెప్పను అది నాన్న ఆత్మ.

అవతలి వాళ్ళు సంతోషంగా ఉండాలని తనకి శాంతి దొరక్కపోయిన వచ్చి తిన్నాడేమో. ఇలాంటి కూతురి వల్ల అలాంటి కుటుంబాన్ని ఎందుకు బాధ పెట్టాలని వచ్చి తిన్నాడేమో అని ఏడుస్తూ ఉన్నాను.

అందరు మిద్దెపైన భోజనాలు చేస్తుంటే నేను కింద కూర్చున్నాను. ఎవరో తలుపు తట్టారు. వెళ్లి తీసి చూసాను.

'అమ్మ, నేను నాన్నగారి ఆఫీస్ లో పనిచేస్తాను,' ఎవరో ఆఫీస్ బాయ్ వచ్చారు నాన్న ఆఫీస్ నుంచి.

'చెప్పండి,' కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగాను.

'ఏం లేదు అమ్మ.. నాన్నగారు అప్పట్లో కొన్ని ఫైల్స్ తెచ్చుకున్నారు కదా అవి తీస్కుని వెళ్ళడానికి వచ్చాను. ఇన్ని రోజులు మీరు బాధలో ఉన్నారని నేను కూడా రాలేదు. ఇప్పుడు కొంచెం అర్జెంటు పని ఉంది అమ్మ వాటితో.'

'పర్లేదు లోపలకి రండి, నేను ఇస్తాను,' అని ఆయన్ని లోపలకి తీసుకెళ్ళాను.

పక్కనే షెల్ఫ్ లో ఉన్న తాళాలు తీసి మూడేళ్ళ తరువాత మళ్ళీ నాన్న రూమ్ లోకి వెళ్ళాను. ఆయన జ్ఞాపకాలతో నిండిపోయిన ఆ రూమ్ లోకి అడుగుపెట్టగానే మళ్ళీ కన్నులు అలిసిపోయేంత ఏడ్వాలనిపించింది.

ఆఫీస్ బాయ్ వచ్చి ఫైల్స్ అన్ని తీసుకున్నాడు. పక్క షెల్ఫ్ లో ఉన్న ఫైల్స్ చూడలేదు. 'ఇదిగో చూడండి. అక్కడ ఆ బ్లూ ఫైల్స్ కూడా తీసుకెళ్లండి,' అని ఆయనతో అన్నాను, మెల్లగా బెడ్ మీదినుంచి లెగుస్తూ.

'అవి మావి కావమ్మా. మావి అన్ని నేను తీసుకెళ్తున్నాను ఇదిగో,' అని ఫైల్స్ తీస్కొని బయటకి బయల్దేరాడు. సరేనని చిన్నగా తలూపి ఆ ఫైల్స్ వైపు వెళ్ళాను. అవి ఎక్కడో చూసిన ఫైల్స్ అని గుర్తొస్తుంది నాకు.

మొదటి ఫైల్ ఓపెన్ చేస్తే అందులో శివశంకర్ అనే పేరు ఉంది. రెండోది, మూడోది అక్కడ ఉన్న పది పన్నెండు ఫైల్స్ లో ప్రతిదీ ఆ పేరు పైనే. అందులో రాసినవి చదివి కళ్ళు బైర్లు కమ్మాయి. కాస్త కుదుటపడి చూడగా వాటి మీద డాక్టర్ పేరు చూసాక ఇక తట్టుకోలేకపోయాను. ఇంత మోసం ఎలా జరిగింది నాకు అని నిలదీయడానికి వెళ్ళాను. హాస్పిటల్ కి చేరుకున్నాను.

'వినోద్! వినోద్!' అంటూ ఆయన గదిలోకి వెళ్ళాను. ఎవరో పేషెంట్ తో ఆయన మాట్లాడుతుంటే, వెళ్లి ఆయన టేబుల్ పైన ఆ ఫైల్స్ విసిరేసి అడిగాను. 'సిగ్గు లేదా? ఒక డాక్టర్ వి అయ్యుండి ఇంత మోసం చేయడానికి. మా నాన్న అంటే పిచ్చోడు, నీ బుద్ధి ఎక్కడికి పోయింది?'

'శశి గారు. ఒక పది నిముషాలు ఆగండి. నేనే వచ్చి మీతో మాట్లాడుతాను,' అని అడిగాడు. ఆయన పేషెంట్ కూడా ఎవరో మా నాన్న వయసు వారై ఉండటంతో ఎందుకో మరో మాట లేకుండా బయట కూర్చొని ఏడుస్తూ ఎదురుచూసాను.

ఒక పది నిమిషాల తరువాత వినోద్ గారే బయటకి వచ్చి నన్ను లోపలకి తీసుకెళ్లారు.

'వినోద్ ప్లీజ్ చెప్పండి. ఏంటివి ఇవన్నీ? మీరు ఎంత మంచి వారు అనుకున్నానో తెలుసా?'

అతను ఆ ఫైల్స్ అన్ని సరిచేస్తూ బల్లపై పెట్టాడు. 'మీ నాన్న ఈ విషయం మీ కుటుంబానికి ఎప్పటికి తెలీకూడదు అని అనుకున్నారండి. అతిముఖ్యంగా మీకు.'

'అసలు ఎప్పటినుంచి ఇదంతా?'

'ఆ కాన్సర్ ఎప్పుడు, ఎందుకు స్టార్ట్ అయిందో తెలీదు కానీ.. మేము దానిని చాలా లేట్ గా గుర్తించాము,' ఆయన చెప్పాలా.. వద్దా.. అని సంకోచపడుతూనే చెప్పడానికి సిద్ధం అయ్యారు. 'మూడు నెలల ముందే మాకు తెలిసింది, ఆయనకి ఇంకా ఎక్కువ రోజులు మిగలలేవు అని. కానీ ఎన్ని రోజులో అప్పుడే చెప్పలేకపోయాం.'

'అంటే ఆయన నన్ను రమ్మంది..?'

'ఆయనకు ఇవే చివరి రోజులు అని తెలిసిన మరుక్షణం ఆయన తలుచుకుంది మిమ్మల్నే. చాలా బాధపడ్డారు. ఎన్ని రోజులు ఉంటారో తెలీక వెంటనే మిమ్మల్ని చూడాలనుకున్నారు. మేము రక్త పరీక్షలు చేయడానికి బ్లడ్ సాంపిల్స్ కలెక్ట్ చేసాం ఆరోజు. మరుసటి రోజు అంటే మీ సీమంతం రోజు రిజల్ట్స్ వచ్చాయి. మరో రెండు నెలల కంటే ఎక్కువ బతకరని.'

వినోద్ గారు మాట్లాడుతున్నకొద్దీ నాకు నాన్నపై కోపం పెరుగుతూ వచ్చింది.

'ఆఖరి క్షణాలు తాను ప్రాణంగా చూసుకునే కూతురితో గడపటానికి చాలా తహతహలాడారు. మిమ్మల్ని హాస్పిటల్ కి తెచ్చిన ప్రతిరోజూ, మిమ్మల్ని డాక్టర్ లక్ష్మి వద్ద వదిలేసి, ఆయన నా కేబిన్ కి వచ్చి బాధపడేవారు. ఎక్కువ శ్రమ తీసుకోవద్దని నేను ఎంత వారించినా.. ఇదే ఆయనకి చివరి అవకాశం అని.. దీని తరువాత ప్రేమని చూపెట్టడానికి ఆయన ఉండరు కాబట్టి పూర్తిగా వాడుకోవాలనుకున్నట్టు చెప్పేవారు.'

వెంటనే కూలబడిపోయాను. నాన్న మీద కోప్పడాలో జాలి పడాలో తెలీలేదు. 'నిజంగా ఇంకెవరికి ఈ విషయం తెలీదా?'

వినోద్ గారు అడ్డంగా తలూపారు.

'ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్పండి.'

'అడగండి, శశి గారు.'

'నేను బిడ్డని నార్మల్ గానే డెలివర్ చేయగలిగే దానిని కదా? నాకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు కదా?'

ఆయన మౌనంగా నిల్చున్నాడు. నాకు ఏడుపు ఆగలేదు. 

'మీకు ఆపరేషన్ అవసరం అని లక్ష్మి గారితో చెప్పించిన రోజే ఆయనకు మేము భరోసాగా ఇచ్చిన రెండు నెలల గడువు పూర్తయింది. అప్పటి నుంచి ప్రతి క్షణం చివరి క్షణంలా బతికారు ఆయన. అందుకే ఆయన అంత పట్టు పట్టారు. ఆయన చనిపోవటం లేదా ప్రాణాల కోసం కష్టపడటం మీ కంట పడొద్దు అని మిమ్మల్ని దూరం చేయాలి అనుకున్నారు. అందుకే ఆపరేషన్ అని అబద్ధం ఆడి మిమ్మల్ని మీ ఊరికి పంపించేద్దామ్ అనుకున్నారు. కానీ మీరు అందుకు ఒప్పుకోలేదు. అంతలో ఇదంతా జరిగిపోయింది.'

కోపంగా అరిచాను, 'ఎందుకు పంపించాలి? ఏం చేసేవారు ఆయన ఒక్కడే ఇక్కడ?'

'తెలీదు. ఆయన ఆలోచనంతా మీరు బిడ్డను కనే సమయంలో సంతోషంగా ఉండాలనే. మీరు సేఫ్ గా బిడ్డకి జన్మనివ్వగానే, నిద్రలో జరిగిపోయింది అని ఏదో కట్టుకథ అల్లేసి మీ కుటుంబానికి చెప్పమన్నారు.' రూమ్ అంత మౌనం కప్పేసింది.

ఇక చెప్పటానికి ఏమి లేదు అన్నట్టు వినోద్ గారు ఆ ఫైల్స్ అన్ని పక్కనే ఉన్న చెత్తబుట్టలో వేసేసారు.

నేను మౌనంగా లేచి వెళిపోతుండగా, వినోద్ నాతో అన్నారు, ' శశి గారు, మీ నాన్నని మీరు చంపలేదు. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నిజం చెప్పాలంటే మీరే ఆయన్ని ఇంకొన్ని రోజులు ఎక్కువ బతికేలా ప్రోత్సహించారు.' 

గుండె నిండా బాధ, కళ్ళ నిండా నీరుతో ఇంటికి ఒచ్చేసాను. ఇంట్లో వాళ్ళందరూ కంగారు కంగారుగా నాకోసం వెతికారు. అందరి మొహాలు చూస్తూ ఏమి మాట్లాడలేక వాళ్ళకి ఏమి చెప్పలేక నాలోనే మధనపడుతూ నాన్నతో కోపాన్ని పంచుకోడానికి ఆయన రూమ్ కి వెళ్ళాను. ఆదిత్య, అమ్మ, చెల్లి అందరు అడుగుతున్నా.. అరుస్తున్నా.. మాట మాట్లాడకుండా నాన్న రూమ్ లోకి వెళ్లి గడి వేసాను.

ఆయన మంచం మీద అలా పడుకుని ఏడుస్తూ ఉండగా ఒక చిన్న ఇనుము డబ్బాపై నా దృష్టి పడింది. అది నాన్నదే అని గుర్తుంది కానీ, చిన్నప్పటి నుంచి ఎవరిని ముట్టనిచ్చేవారు కాదు. ఎందుకో తెలీదు.. నాన్నకు దగ్గరవడానికి వెళ్తున్నట్టు అనిపించింది దానిని తీస్తుంటే.

తెరిచి చుస్తే పెట్టె నిండా నా ఫోటోలు. నా చిన్నప్పటి నుంచి నేను పెరిగి పెద్దయ్యే వరకు అన్ని నా ఫొటోలే. కానీ ఒకే ఒక ఫోటో నా దృష్టిలో పడింది.

అది నేను గర్భవతినని తెలిసాక దిగిన మొదటి ఫోటో. ఈ ఫోటో నాన్న దగ్గరికి ఎలా వచ్చిందో అర్ధం కాలేదు? ఎందుకంటే ఆ ఫోటో నేను అమ్మకి రాసిన లేఖలో పెట్టి పంపింది. అది నాన్న దగ్గరికి ఎలా వచ్చింది? పెట్టె అంతా కింద కుమ్మరించాను.

ఫోటోల కింద అన్ని ఉత్తరాలున్నాయి. అన్ని నేను రాసినవే. చాలా వాటిపైన నూనె మరకలు, కుళ్లిపోయిన కంపు. ఎవరో చెత్తబుట్టలో వేసినవి ఏరుకుని తెచ్చినట్టు.

ఇవన్నీ నేను ఇంటి నుండి వెళ్లిపోయిన తరువాత రెండేళ్లు రాసిన లేఖలు. నేను ఇల్లు వదిలిన రెండు నెలలకి రాసిన మొదటి లేఖ నుంచి, అమ్మ నాన్నకు కనబడకుండా చెత్తలో వేసిన చివరి లేఖ వరకు అన్ని అందులోనే ఉన్నాయి.

అంటే ఇవన్నీ నాన్న దాచిపెట్టుకున్నారా? అమ్మ చెత్తలో పడేసిన లేఖలు అన్ని ఈయన తెచ్చిపెట్టుకున్నారా? ఇంత ప్రేమ ఎలా దాచుకున్నాడు నాన్న అసలు? ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు చూపెట్టలేదు? ఎందుకు నన్ను దూరం పెట్టి తాను నరకం అనుభవించి నన్ను నరకంలో వేసాడు?

బాధ, కోపం అన్ని తారాస్థాయికి చేరుకున్నాయి. గట్టిగట్టిగా ఏడుస్తూ అరిచాను. బయట నుంచి ఆదిత్య, అమ్మ, చెల్లి కంగారు పడుతూ డోర్ కొడుతున్నారు.

'అమ్మ! నాన్న నన్ను మోసం చేసాడే! నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతా. ఆయన్ని అడగాలి.. ఎందుకు నన్ను మోసం చేయాలనిపించిందో తెలుసుకోవాలి. క్షమించు ఆదిత్య.. నేను వెళ్ళాలి. నాకు ఇప్పుడు నీకంటే నాన్నే ఎక్కువ కావాలనిపిస్తుంది. ఆరోజు నీకోసం నాన్నని వదిలేసాను. ఈరోజు నాన్న కోసం నిన్ను వదిలేస్తాను, అవసరమైతే నన్ను వదిలేస్తాను. ఇక నేను ఆగలేను. నాన్నని అడగాల్సిందే..' అని ఏడుస్తూ ఉండగా, ఆదిత్య డోర్ బద్దలు కొట్టి లోపలకి వచ్చాడు. నన్ను హత్తుకున్నాడు. ఆదిత్యని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ కూర్చున్నాను.

‘నా వల్ల కాదు ఆదిత్య. నేను నాన్న దగ్గరికి వెళ్తా ప్లీజ్. నన్ను వదిలేయండి,’ అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాను.

గాజులు అన్ని పగిలిపోయాయి. జుట్టు చెరిగిపోయింది. పగిలిన గాజులు ఉన్న చేతులతో నన్ను నేను కొట్టుకుంటుంటే మొఖంపై  గాట్లు పడ్డాయి. కానీ నొప్పి తెలీట్లేదు. ఇక్కడ కూడా నాన్న ఇచ్చిన నొప్పే ఎక్కువగా ఉంది అని బాధ పడుతూ ఆకాశమంతా ప్రతిధ్వనించేలా అరుస్తుండగా నా ఉమ్మునీరు విచ్చిన్నమైంది. బిడ్డ బయటకి రావడానికి ప్రయత్నిస్తోంది.

ఆదిత్య కంగారుగా బయటకి వెళ్లి రిక్షా తెచ్చాడు. అమ్మ, చెల్లి సాయం తీస్కొని రిక్షా ఎక్కి హాస్పిటల్ కి వెళ్ళాం. వెంట వెంటనే అన్ని జరిగిపోతున్నాయి.

చిన్న నొప్పికి అందరు అమ్మని కలవరిస్తే, నేను ఇక్కడ పురిటి నొప్పులు అనుభవిస్తూ కూడా నాన్నని కలవరిస్తున్నాను.

డెలివరీ రూమ్ లోకి తీసుకెళ్లారు. నొప్పి కంటే బాధే ఎక్కువయింది.

ఇంత ప్రేమ చూపెట్టిన నాన్న అంత మోసం ఎలా చేయగలిగాడు అని. అంత నమ్మశక్యంగా ఎలా నటించాడు అని. కూతురిని ప్రేమించే మాట అటు ఉంచితే కూతురిని ద్వేషించే వాడు కూడా చేయలేనిది చేసాడు. బయట చూస్తే అమ్మ, చెల్లి ఏడుస్తూ భయంభయంగా నిల్చున్నారు. 

ఆదిత్య కంగారుపడి నను చూడడానికి వస్తుంటే డాక్టర్ ధైర్యం చెప్పి బయటకు పంపేశాడు. కానీ వీళ్లెవరి గురించి పట్టింపు లేకుండా ఆ క్షణం కూడా నాన్న మీద కోపంతోనే ఉన్నాను.

నాన్నే గనక అక్కడ ఉండుంటే ఆపరేషన్ బెడ్ పై నుంచి కిందకు దిగి మెడ పట్టుకుని, ఆయన చెవులు పగిలేలా అడిగేదాన్ని 'ఎందుకు నాన్నా? నన్నెందుకు మోసం చేసావ్ నాన్నా!' అని.

డెలివరీ రూమ్ లో ఒక అర్ధ గంట నొప్పులు అనుభవించి బిడ్డకి జన్మనిచ్చాను.

బిడ్డని చేతిలోకి తీసుకున్న డాక్టర్ నా వైపు చూసి, 'కంగ్రాట్స్ అమ్మ! మగ బిడ్డ పుట్టాడు నీకు,' అని నా చేతిలో పెట్టారు. బిడ్డని దగ్గరికి హత్తుకున్నాక ఆ క్షణం వరకు పడిన కోపం అంతా మటుమాయం అయింది. బాధ, భయం అన్ని వాడిని ఒడిలోకి తీసుకున్న వెంటనే దూరమైపోయాయి. సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

అంత సంతోషంలో కూడా నా మనసు పలికిన ఒకే ఒక మాట, 'నాన్నా..'

vineela

Vineela Manchikatla

I am a computer science III year Btech student. writing stories as a hobby. I have already authored a book named Bhalpaw to Kadhal which was reviewed by Udaan. I also won a writing competition in scribbles club on historical fiction in telugu category. i am a film buff and like to write stories of variety of genres.

Top