నాన్నా!
StoryVineela Manchikatla
A turning tale of events that describes the relationship between a father and daughter, this is a captivating story that will keep the reader hooked till the end.
'నాన్నా! నాన్నా!' చిన్న నొప్పికే అందరు అమ్మని కలవరిస్తే, నేను ఇక్కడ పురిటి నొప్పులు అనుభవిస్తూ కూడా నాన్నని కలవరిస్తున్నాను.
అంత ఇష్టం నాకు మా నాన్న అంటే. చిన్నప్పటి నుంచి నేను ఏది అడిగినా ఇచ్చేవారు, అలాంటిది ఆయన నన్ను మొదటిసారి నోరు తెరిచి ఒకటి అడిగారు. నాన్నని అంతలా ప్రేమించే నేను ఆరోజు ఆయన కోరుకున్నది ఇవ్వలేకపోయాను.
'ఎలా ఉన్నావ్ తల్లి?' రిక్షా దిగగానే అమ్మ పలకరించింది, 'ప్రయాణం మంచిగానే జరిగింది కదా, అల్లుడు గారు?' రిక్షా నుంచి సూటుకేసు తీస్తున్న ఆదిత్యని అడిగింది.
'బాగానే అయింది, అత్తమ్మ,' ఆది అమ్మకు జవాబిచ్చి రిక్షా వానికి డబ్బులు ఇచ్చేసి పంపించాడు.
'లోపలికి రండి,' అంటూ నా చేతిలో చేయేసి నన్ను మెల్లగా నడిపించింది అమ్మ. 'అదిగో ఆ గదిలోకి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, ఈలోపు వంట చేసేస్తాను. మధ్యాహ్నం అనగా ఎప్పుడో తినుంటారు,' అని నన్ను ఒక కుర్చీలో కూర్చోబెట్టి తాను వంట గదిలోకి వెళ్ళింది.
'శశి, నేను స్నానం చేసి వస్తాను,' అంటూ ఆదిత్య గదిలోకి వెళ్ళాడు.
చాలా రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చాను కదా.. అమ్మ వదలకుండా మాట్లాడుతూనే ఉంది, సూటుకేసులో నుంచి బట్టలు తీసి షెల్ఫ్ లో సర్దుతూ, సాయం చేద్దాం అని లేస్తే కోప్పడింది.
'ఇక్కడికి వచ్చాక కూడా నీ పనులు నువ్వే చేస్కుంటావా? నువ్వు అసలే ఉట్టి మనిషివి కూడా కాదు. అక్కడ అంటే మీరు ఇద్దరే కాబట్టి తప్పదు. ఇక్కడికి వచ్చేసావ్ కదా.. ఇక అంతా నేనే చూస్కుంటా,' అని నన్ను కూర్చోబెట్టి వాడలోని ముచ్చట్లు అన్ని చెబుతూ ఉంది.
ఇంతలో స్వాతి కాలేజీ ముగించుకుని వచ్చింది. 'అమ్మా ఎవరొచ్చారే? బయట కొత్త చెప్పులు ఉన్నాయ్,' అంటూ గదిలోకి వచ్చి నన్ను చూసింది, 'అక్కా..!' అంటూ తన పుస్తకాలు మంచంపై విసిరేసి నన్ను గట్టిగా కౌగిలించుకుంది,
'ఎన్నాళ్ళయ్యిందే!' తన కంటి నుంచి వచ్చిన రెండు చుక్కలు నా భుజాల పై పడ్డాయి. 'ఇక బాబు పుట్టేదాకా ఇక్కడే ఉంటావ్ కదా!' కళ్ళు తుడుచుకుంటూ అడిగింది.
'ఏంటే! పాప పుడితే వెళ్లనివ్వవా మా ఇంటికి?' నవ్వుతూ అడిగాను.
'లేదు, బాబు పుట్టేదాకా ఉండాల్సిందే,' అని నవ్వుతూ నా ఒళ్ళో పడుకుంది, నా కడుపుపై చేయి వేసి మాట్లాడుతూ.
'నాకు ఉండాలనే ఉంటుంది కదా.. కానీ..' నా దీర్ఘ మౌనం అమ్మ, చెల్లెలు ఇద్దరూ పసిగట్టారు.
'ఏయ్! కాళ్ళు చేతులు కడుక్కోకుండా అక్క దరిదాపుల్లోకి కూడా వచ్చేది లేదు నువ్వు. ముందు వెళ్లి ఆ పని చూడు!' అమ్మ చెల్లిని మందలిస్తూ ఆ గదిలో నిండిన మౌనాన్ని చెరపటానికి ప్రయత్నించింది.
ఇక నేను కూడా స్నానాదులు పూర్తి చేసుకొని, అమ్మ కోసిచ్చిన ఆపిల్ పండు తింటూ స్వాతితో మాట్లాడుతున్నాను. ఆది అమ్మకి ఏవో కూరగాయలు కావాలంటే తేవడానికి సంతకు వెళ్ళాడు.
ఒక్కసారిగా నా గుండె వేగం పెరిగింది. ఎప్పుడో మూడేళ్ళ క్రితం కొట్టుకున్నట్టే మళ్ళీ అదే మాదిరిగా కొట్టుకుంటుంది. కూర్చొని ఉన్నా కాళ్ళు వణుకుతున్నాయి. 'అక్కా ఏమైందే?' స్వాతి చెమటలు పట్టి వణుకుతున్న నా చేతుల్ని పట్టుకుని అడిగింది.
'అమ్మ! ఒకసారి రావే..' స్వాతి భయపడుతూ అమ్మని పిలిచింది. 'ఏమైంది అమ్మ?' అమ్మ వంట గది నుంచి కంగారు పడుతూ వచ్చింది. 'అమ్మా!' పక్కనే ఉన్న మంచి నీళ్లు తాగి ఒక క్షణం మనసు ప్రశాంతంగా చేసుకొని మాట్లాడాను, 'అమ్మా! నాన్న వస్తున్నాడేమో!' అమ్మ గోడ మీద గడియారం వైపు చూసింది. అప్పుడు సమయం ఏడున్నర.
నన్ను వెంటనే తన గుండెలకి హత్తుకుని ఓదార్చింది. 'ఏం కాదు తల్లి! నువ్వేం కంగారు పడకు. నాన్న ఏం అనడు. నేను మాట్లాడుతాగా,' నా తలని నిమురుతూ ధైర్యం చెప్పడానికి ప్రయత్నించింది, 'అయినా నాన్నని ఒప్పించే కదా నిన్ను రమ్మన్నాను..'
'లేదమ్మా! నాన్న..' గేట్ బయట స్కూటర్ శబ్దం, అది నాన్నదే. మూడేళ్ళ క్రితం కలిగిన భయమే మళ్ళీ వేస్తుంది. నాన్న అడుగుల చప్పుడు నా గుండెలో ప్రతిధ్వనిస్తుంది.
'ఉమా, ఈరోజు ఆఫీస్ లో ఆ బాలాజీగాడు ఏం చేసాడో తెలుసా?' నాన్న నవ్వుతూ రూమ్ లోకి వచ్చి తన బ్యాగ్ సోఫాపై పెడుతూ మా వైపు చూసాడు. ఆ ముఖంపై నవ్వు మాయమైంది. నాకు చెమటలు పట్టడం మొదలయ్యాయి. అలా నిల్చుని చూస్తూ ఉండిపోయాడు నా వైపు.
'శశి.. నీకిష్టమని జిలెబీలు తెచ్చా..' ఆదిత్య వచ్చాడు. నాన్న వెనక్కి తిరిగి చూడగానే ఆది కూడా అక్కడే ఆగిపోయాడు. 'మావయ్య!'
ఆది గొంతులోను అదే భయం. కాదు నేను భయపడుతున్నానేమో అన్న బాధ. నాన్న ఆది వైపు అలా తీక్షణంగా చూసి, మళ్ళీ నా వైపు చూపు మరల్చాడు, నా కడుపును చూస్తూ కోపంగా నిల్చున్నాడు. ఒంట్లో మిగిలిన ఆ కాస్త ధైర్యం కూడగట్టుకుని నేనే పలకరిద్దాం అని అనుకున్నాను.
నా నాలుక కదలడానికి భయపడుతుంది. గొంతు నేను మాట్లాడొద్దని తడారుతుంది. అయినా సరే మాట్లాడాల్సిందేనని నిర్ణయించుకున్నాను. 'నా..' అంటూ చెల్లి చేయి పట్టుకుని నిల్చోడానికి ప్రయత్నించాను.
'ఉమా!!' ఒక్కసారిగా నాన్న అరుపు. భయానికి కాళ్లలో సత్తువ పోయి కుర్చీపైనే కూలబడిపోయాను. ఏడుపు కంటి అంచున ఆగింది. 'నేను స్నానం చేయాలి, వేడి నీళ్లు పెట్టు,' అంటూ అమ్మకి చెప్పి నా వైపు మరో చూపు చూడకుండా వెళ్లిపోయారు.
నాన్న తన గదిలోకి వెళ్ళగానే ఏడ్చేసాను. అమ్మ, చెల్లి, ఆదిత్య వచ్చి ఓదారుస్తూనే ఉన్నారు, అయినా కన్నీళ్లు ఆగలేదు. 'ఉమా!' గదిలో నుంచి నాన్న మరోసారి పిలిచారు, 'త్వరగా!' ఏడుస్తున్న శబ్దం కూడా రాకుండా చేతులతో నోరు బిగించుకుని కన్నీరు కార్చాను.
నాన్న కోప్పడ్డారు అని కానీ, నాన్న వల్ల నేను ఇలా ఏడుస్తున్నానని కానీ నాకు నాన్నపై ఎటువంటి కోపం లేదు. ఎందుకంటే ఇదంతా నేను చేసుకున్నదే. మూడేళ్ళ క్రితం నేను తీసుకున్న నిర్ణయమే ఈరోజు నన్ను ఇంతలా బాధిస్తుంది..
'ఎంత పని చేసావే, పిచ్చిదానా!' నా పై చేయి చేసుకోకుండా తన కోపాన్ని అణుచుకుంటూ అమ్మ కంగారుపడుతుంది. 'మీ నాన్నకి తెలిస్తే ఏమన్నా ఉందా? ఇలాంటివి అన్ని పెళ్ళిచూపులకి ముందే చెప్పాలి కదా!'
నేను అమ్మతో మాట్లాడుతుంటే ఆదిత్య నా చేయి పట్టుకుని నించున్నాడు. ఇంట్లోని చుట్టాలందరు చూస్తూ నిలబడిపోయారు.
గత రెండు-మూడు రోజులుగా ఇంట్లో నిండిన నవ్వులు మూగబోయాయి. గుమ్మానికి కట్టిన మామిడాకులు గాలికి ఊయలలు ఊగడం ఆగిపోయాయి. పూల తోరణాలు సువాసన వెదజెల్లడం కూడా ఆపేసాయి. అందరు ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటున్నారు. అయినా నాకు వాళ్ళ గురించి పట్టింపు లేదు, వాళ్లేమనుకుంటారోనని భయం వేయట్లేదు. ఎందుకంటే ఆది నాతో ఉన్నాడు. కానీ నా భయం అంతా నాన్న గురించే.
ఆయనకి ఏం చెప్పాలని ఆలోచిస్తుండగా గేట్ బయట స్కూటర్ శబ్దం, అది నాన్నదే. నా చూపు గడియారం వైపు మళ్లింది. అప్పుడు సమయం ఏడున్నర. ఒక్కసారిగా నా గుండె వేగం పెరిగింది.
'శశి.. ఏం అయింది?' వణుకుతున్న నా చెమటలు పట్టిన చేతులను పట్టుకుని అడిగాడు ఆదిత్య. నేను అడ్డంగా తలూపాను ఏం లేదని. నాన్న అడుగుల చప్పుడు నా గుండె లో ప్రతిధ్వనిస్తుంది. పక్కనే ఉన్న మంచి నీళ్లు తాగి, మనసు కుదుటపరుచుకొని, నాన్న ప్రశ్నలకు జవాబివ్వాలని సిద్ధంగా ఉన్నాను.
'ఏంటి బావ? అలా ఉన్నారు అందరు. నీ మేనకోడలు పెళ్ళికి నువ్విలా ఉంటె ఎట్లా?' నాన్న అందరిని పలకరిస్తూ లోపాలకి వస్తున్నాడు. 'ఏంటి ఉమా? మీ అన్నకి దావత్ లో మటన్ బొక్కలు రాలేవని బాధపడుతున్నాడా?' అంటూ లోపలకి వచ్చాడు నాన్న.
నన్ను, ఆదిత్యని చూసి నిష్ఠురుడై నించున్నాడు.
నాకు నాన్నతో ఉన్న ఇరవై ఏళ్ళ బంధంలో నాపై ఆయన ఒక్క రోజు కూడా కోప్పడింది లేదు, కానీ ఆ క్షణం ఆ కళ్ళలోకి చూసాక నా గుండె ఆగిపోయింది. ఆయన చేతిలో ఉన్న పెళ్లి సామాన్లు సోఫాపై పడేసారు. మెల్లగా నా వైపు నడుస్తూ వచ్చారు. ఆయన వేసే ప్రతి అడుగు నా ఊపిరిని ఆపేస్తూ వచ్చింది. చుట్టాలందరు నాన్నకి ఏదో నచ్చజెప్పటానికి ప్రయత్నిస్తున్నారు కానీ నాన్న ఆగట్లేదు.
నా ముందుకి వచ్చి నించున్నారు. నా కళ్ళలోకి చూసిన ఆ చూపులో ఆయనకి జరుగుతున్న అవమానానికి నన్ను బాధ్యురాలిని చేయడం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. నన్ను అలా కోపంగా చూస్తూ, ఆదిత్యని గట్టిగా కొట్టారు. 'నాన్నా!' ఆదిత్యని పట్టుకుని నాన్న మీదకి అరిచాను.
'ఏం చేస్తుంటావ్ రా నువ్వు? అసలు ఎవడ్రా నువ్వు?' నాన్న నా వైపు చూడను కూడా లేదు.
'నా పేరు ఆదిత్య అండి.'
'ఏం చేస్తుంటావ్? అది అడిగాను ముందు!'
'అది..' ఆదిత్య చెప్పలేక సతమతమవుతుంటే నేను జవాబిచ్చాను. 'ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాడు, నాన్న. తనకి వెనకా ముందు కూడా ఎవరు లేరు సాయం చేయడానికి. కానీ మంచివాడు నాన్న. నన్ను బాగా చూసుకుంటాడు. నాకా నమ్మకం ఉంది.'
నేను అంతలా మాట్లాడుతున్న నాన్న నా వైపు చూడలేదు, 'ఇవన్నీ తెలిస్తే మీరు ఒప్పుకోరు అని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.'
'చూసావా ఉమా? సొంత నిర్ణయాలు తీసుకునేంత పెద్దది అయిపోయింది నీ కూతురు. నేను డాక్టరుని తీస్కోచి అమ్మా నీ భర్త అని పరిచయం చేస్తే.. ఉద్యోగం సద్యోగం లేని వాడిని తీస్కోచి నా అల్లుడని పరిచయం చేసింది. నా స్నేహితుని కొడుకుని తీస్కోచి అమ్మా నీ మొగుడు అని పరిచయం చేస్తే.. దిక్కు మొక్కు లేని అనామకుడిని తీస్కోచి నీకు అల్లుడని పరిచయం చేస్తుంది కనబడుతుందా!!' అమ్మపై అరిచాడు నాన్న.
'బావ వదిలేయ్. అందరున్నారు.. మనం తర్వాత మాట్లాడుదాం,' పెద్ద మామయ్య వచ్చి నాన్నను శాంతింపచేయటానికి చూసాడు.
'వదిలేయ్ ఏంటి బావ? అందరి ముందే జరగాలి ఇది. నీ మేనకోడలు అందరికి ఒక ఉదాహరణ, ఒక ఆదర్శం అవ్వాలి. కన్నవాళ్ళని లెక్కచేయకుండా, తమకి నచ్చినట్టు ఎలా ఉండాలో చెప్తుంది. నేర్చుకోవాలి కదా! ఇదిగో రేపు ఇది కూడా ఇలానే చేయాలి కదా!' పక్కనే భయంగా చూస్తున్న స్వాతిని పట్టుకుని అరిచారు. 'అందరు ఉన్నప్పుడే మాట్లాడాలి బావ.'
'అలా అని ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటావా నాన్న?' నోరు తెరిచి ఎదురు తిరిగాను.
స్వాతి మొఖాన్ని చేతిలోకి తీస్కొని దాని కళ్ళలో చూస్తూ అన్నారు, 'చూసావా స్వాతి? మీ అక్కకి పెళ్లికి ముందు రోజు ఎదురు తిరిగి మాట్లాడే ధైర్యము ఉంది కానీ.. నెల రోజుల ముందు తండ్రితో మనసు విప్పి మాట్లాడే ధైర్యం లేదు.'
'నన్ను నమ్మండి. శశిని నేను సంతోషంగా చూసుకుంటాను. ఎలాంటి కష్టం రానివ్వను. మీరు తన పెళ్ళికి ఇంకొంచెం సమయం ఆగుంటే నేనే ఉద్యోగంతో మీ ఇంటికి వచ్చేవాడిని, మామయ్య.'
'ఏయ్ ఛీ ఆపు!! ఎవడ్రా నీకు మామయ్య? నువ్వు నా పెళ్ళాం కూతురికి మొగుడివి మాత్రమే.. నాకు అల్లుడివి కాదు. దాని మెడలోని పసుపుతాడు తెంపేస్తే అది కూడా కాకుండా పోతావ్!'
ఒక చేత్తో ఆదిని పట్టుకొని మరొక చేత్తో మెడలోని పసుపుకొమ్మని పట్టుకుని ఆ రోజు నాన్న కళ్ళలో చూసిన కోపం ఎప్పటికి మర్చిపోలేను.
'నాన్న! తప్పు చేస్తే క్షమించండి కానీ తప్పలేదు. ఇదేమి మిమ్మల్ని నలుగురిలో అవమానించాలని చేసిన పని కాదు నాన్న. ప్రేమించాను, ఆలోచించాను, పెళ్లి చేసుకున్నాను అంతే.'
నాన్న ఒక చిన్న నవ్వు నవ్వారు. 'నీ కూతురికి పెళ్లి అయింది ఉమా! నీ కూతురు ఒక ఇంటి మహాలక్ష్మి అయింది ఉమా! ఎందుకు ఏడుస్తున్నావ్? ఇది ఆనందపడాల్సిన విషయం. ఆనందపడు. అవును.. పెళ్ళైన కూతురు మెట్టినింట్లో కదా ఉండాలి. ఇంకా పుట్టింట్లో ఏం చేస్తుంది?' అని నాన్న నా జుట్టు పట్టుకుని ఈడ్చుకువెళ్లి గుమ్మం బయటకి విసిరారు.
'శశి..' ఆదిత్య నా ఒంటికి అంటుకున్న దుమ్ము దులిపి నన్ను లేపాడు. 'మీకేమన్న పిచ్చా? కూతురిపై ఉన్న ప్రేమ ఇదేనా?'
'నా కూతురు, నా ఇష్టం. ప్రేమిస్తాను లేదా చంపేస్తాను! నువ్వెవడివిరా అడగడానికి?' ఏనాడూ నాపై చేయి కూడా లేపని నాన్నని ఆరోజు అంత ఉగ్రంలో చూసి సగం చచ్చిపోయాను.
కానీ అయన మెల్లగా శాంతించి అన్నారు, 'నా కూతురిపై నాకు ప్రేమ ఉంది బాబు.. నీ భార్య పైనే లేదు. నీ పెళ్ళానికి చెప్పు, ఇక్కడితో అంతా అయిపోయిందని. మళ్ళీ తన నాన్న దగ్గరికి రావాలంటే అది నువ్వు చచ్చాక అయినా రావాలి లేదా నేను చచ్చాక అయినా అని.'
ఆ రోజు ఇంటి బయట అడుగుపెట్టాను అంటే మళ్ళీ ఇదిగో మూడేళ్ళ తరువాత ఇలా వచ్చాను.
ఇల్లు వదిలేసాక వేరే టౌన్ కి మారిపోయాము. సొంతూరికి దూరంగా. అక్కడ ఆది ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ నన్ను పోషించాడు. ఇటువంటి పరిస్థితిలో పిల్లలు వద్దని తనే అన్నాడు. అందుకే నాకు కష్టంగా ఉన్నా తనకోసం ఒప్పుకున్నాను. నా కోరికను తిరస్కరించినందుకు తను ఎక్కువ బాధ పడ్డాడు.
అప్పుడప్పుడు ఆదిత్య రాత్రి షిఫ్ట్ కి వెళ్ళేవాడు. నేను ఒంటరిగా పడుకుంటే ఏవో పిచ్చి కలలు వచ్చేవి. నాన్న ఉండుంటే ఆయన పక్కన వెళ్లి పడుకునేదానిని కదా అని బాధ పడుతూ ఆ రాతుర్లు గడిపేసేదాన్ని.
మెల్లగా ఆ ఓనర్ కి ఆదిత్య పనితనం నచ్చి మంచి పోసిషన్ ఇప్పించాడు. అప్పటినుంచి ఆది రాత్రంతా నాతోనే ఉంటాడు కానీ పీడకల ఒచ్చినప్పుడల్లా ఆదిత్య పక్కనున్నాడన్న ధైర్యం కంటే నాన్న పక్కన లేడనే బాధే ఎక్కువ ఉండేది.
ఆరోజు నేను అలా చేసేసరికి నాన్న చెల్లెలిని చదువుల కోసం పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి పంపేశారు. ఈ మధ్యలో చాలా ఉత్తరాలు రాసాను ఇంటికి.
ఒక సంవత్సరం వరకు ఎటువంటి ప్రత్యుత్తరాలు లేవు. అమ్మకి చదువు లేదు, కాబట్టి రాస్తే గీస్తే నాన్నే చేయాలి. అప్పుడు తెలిసింది.. నాకు అంత పట్టుదల ఎవరి నుంచి ఒచ్చిందోనని. సహజమే అంత ప్రేమగా పెంచుకున్న కూతురు అందరి ముందు అలా చేస్తే ఏ తండ్రైన ఇంకేం చేస్తాడు.
కానీ ఒక రోజు అనుకోకుండా ఇంటి నుంచి లేఖ.
ఆ రోజు నా ఆనందానికి అవధులు లేవు. ఇన్నాళ్ళకి నాన్న నన్ను క్షమించాడా అని సంతృప్తి చెందాను. కానీ తప్పు. అంత తేలికగా ఎలా క్షమిస్తాడు. అందుకే లేఖ ఆయన రాయలేదు.
అమ్మ బాధ చూడలేక తనకి రాయడం చదవడం నేర్పించాడట, అమ్మ తను రాసిన లేఖలో చెప్పింది. అలా రెండో సంవత్సరం అమ్మ నేను లేఖల్లోనే సంభాషించుకున్నాం. కనీసం నా బాగోగులు కనుక్కోడానికి కూడా నాన్న లేఖల గురించి అడిగేవాడు కాదని చెప్పింది. అందుకే నేను రాసిన ప్రతి లేఖ అమ్మ, చెల్లెలు చదివేసాక నాన్న కంట కూడా పడకుండా చెత్తలోకే వెళ్లిపోయేవి అట. నేను గర్భవతిని అయ్యానని తెలిసి కూడా నాన్న మొఖంలో కోపం పోలేదనగానే చాలా బాధేసింది.
జీవితం ఇలా కొనసాగుతుండగా ఒక రోజు వచ్చిన లేఖలో అమ్మ నాకు సీమంతం చేస్తానని రాసింది. చదివి నవ్వుకున్నాను, ముందు నాన్న ఒప్పుకోవాలి కదా అని. కానీ నాన్న ఒప్పుకున్నారట. పొద్దున్న అడిగితే కోప్పడ్డారని కానీ సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ఒప్పేసుకున్నారని చెప్పింది. ఆ క్షణం నా గుండెలోంచి ఎంత బరువు తీసినట్టు అయిందో చెప్పలేను. పక్కనే ఉన్న ఆదిని పట్టుకుని ఏడ్చేసాను.
ఆఖరికి ఈరోజు, మూడేళ్ళ తరువాత మళ్ళీ నా పుట్టింటి గడప తొక్కాను.
కానీ ఇందాక నాన్న ప్రవర్తన చూస్తే అర్థమైంది నా శిక్ష ఇంకా అయిపోలేదని. కన్నీళ్లు తుడుచుకుని కూర్చున్నాను. అమ్మ తినడానికి అన్నం కూరలు తీస్కొచ్చి పెట్టింది. అందరు తినడానికి కూర్చున్నారు. నాన్న కోసం ఎదురు చూస్తుండగా ఆయనే వచ్చారు.
హాల్ అంత ఒక రకమైన నిశ్శబ్దం. కానీ నేను నాన్నతో మాట్లాడకుండా ఉండలేకపోయాను. పర్లేదు, మరోసారి తిట్టినా పర్లేదు, భరిస్తాను నాన్నే కదా.
'ఇన్నేళ్ల తరువాత రమ్మన్నందుకు ధన్యవాదాలు మామయ్య,' ఆది మాట కలపడానికి చూసాడు.
ఒక్క క్షణం నాన్న ఆది వైపు చూసి మళ్ళీ తన పళ్లెంలో అన్నంపై దృష్టి పెడుతూ, 'పర్లేదు, తినండి. ఉద్యోగం ఎలా ఉంది?'
'బాగుంది మామయ్య. వచ్చే నెలలో పెద్ద ఇల్లు ఒకటి తీసుకుంటున్నాను, బిడ్డ కూడా వస్తుంది కదా.'
'మంచిది.'
ఆదితో నాన్న మాట్లాడాక ఇక నేను కూడా మాట్లాడొచ్చు అని ధైర్యం వచ్చింది. ఇంతలో అమ్మ, 'ఏవండీ.. ఆ వంట ఇంకా టెంట్?'
'హ! మాట్లాడేసాను. రేపు పొద్దున్నే అంత సర్దేస్తారు. సాయంత్రానికి కదా నీ కూతురి సీమంతం,' అన్నారు నాన్న నీ అనే పదం ఒత్తి పలుకుతూ.
'అక్క, నీ కూతురు కాదా నాన్న? అసలు నీకు అక్క అంటే ప్రేమ ఉందా? లేనప్పుడు ఎందుకు నాన్న రమ్మన్నావ్?' స్వాతి తిరిగి మాట్లాడింది, చేతిలో ఉన్న ముద్ద పళ్లెంలో విసిరేస్తూ. 'స్వాతి ఆగు!' నేను కోప్పడ్డాను.
'మీ అక్కని నేనే కన్నాను అమ్మ, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇక ప్రేమ అంటావా.. అది ఉంటుంది పోతుంది మనుషులు తీసుకునే నిర్ణయాలను బట్టి...' అని నాన్న ఒక క్షణం ఆగారు, నాకు అర్ధం అవ్వడానికి.
నేను చిన్న నవ్వు నవ్వాను ఆయన ఇంకా ఎం అంటారో విందాం అని, '...కానీ బాధ్యతలు అనేవి కొన్ని ఉంటాయి కదమ్మా. ఓ పెద్ద మనిషిగా అవి నేను తీర్చుకోవాలి, అందుకే రమ్మన్నాను.'
చాలా సంతోషపడ్డాను నాన్న ఆ మాట అన్నందుకు. 'ధన్యవాదాలు నాన్న. మీకు గుర్తుందో లేదో కానీ మీరే ఒకసారి అన్నారు నాన్న.. పిల్లలు పెరిగేకొద్దీ కన్నవాళ్ళు బయటకి కనబడే ప్రేమ తగ్గించి పరోక్షంగా బాధ్యతల రూపంలో ప్రేమిస్తారని. ఇంతకన్నా ఏం కావాలి నాన్న నాకు మీ నుంచి.' ఇక్కడికి వచ్చాక మొదటి సారి ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూసాను.
ఎక్కడో తెగిన బంధం మళ్ళీ ముడేసుకుంటున్న భావన కలిగింది, ఆయన కంటి అంచున నీటి బిందువులు కింద పడటానికి ఎదురు చూస్తుంటే, ఆయన తినడం పూర్తి చేసి అక్కడి నుంచి లేచారు. అమ్మ చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు గోరుముద్దలు పెట్టింది. ఇక పడుకోడానికి సిద్ధం అవుతుండగా, నాన్న ఒక టేబుల్ ఫ్యాన్ తెచ్చి నా మంచం పక్కన పెట్టేసి వెనక్కి చూడకుండా వెళ్లిపోయారు.
ఇంత ప్రేమకి ఆయన ఇంకెన్నాళ్లు బాధ్యత అనే ముసుగు కప్పుతారో చూద్దాం అని నాలో నేనే చిన్నగా నవ్వుకుని లైట్లు ఆర్పేసి టేబుల్ ఫ్యాన్ ఆన్ చేశాను. నా చిన్నప్పుడు వేసవి కాలంలో నాన్న ఒడిలో పడుకుంటే ఆయన చల్లగా గాలి ఊదినట్టు అనిపించింది.
ఎన్నో రోజుల తరువాత మళ్ళీ ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాను.
మరుసటి దినం ఇల్లంతా పూలతో అలంకరించారు. తోరణాలతో ఇంటిద్వారాలు కళకళలాడాయి. ముగ్గులతో నిండిన వాకిలి చుట్టాలందరిని స్వాగతిస్తుంది. మూడేళ్ళ క్రితం ఇలాంటి ఒక రోజునే నాన్నకు దూరం అయ్యాను.. మళ్ళీ ఈరోజు అటువంటి వాతావరణంలోనే నాన్నకి మెల్లగా దగ్గరవ్వబోతున్నానని తెలుస్తుంది.
'అక్కా! అచ్చం పెళ్లికూతురు లాగా ఉన్నావే,' నన్ను నా ఆలోచనల నుంచి బయటకు తెచ్చింది స్వాతి.
'ఇక రా అమ్మా, అందరు ఎదురు చూస్తున్నారు,' అమ్మ రమ్మంది.
చిన్నగా అడుగులు వేస్తూ నా కోసం అలంకరించిన పెద్ద సింహాసనం వంటి కుర్చీలో కూర్చున్నాను. పిన్ని, అత్తమ్మ, పెద్దమ్మ, అందరిని మూడేళ్ళ తర్వాత చూసేసరికి నా మనసు అంతటి సంతోషాన్ని ఆపుకోలేకపోయింది.
చెంపలపై చల్లటి గంధం, నుదుటి మధ్యన ఎర్రటి కుంకుమ, చేతికి రంగురంగుల గాజులు, తలపై అక్షింతల రూపం లో అందరి ఆశీర్వాదాలు. ఈ ఆనందాన్ని పంచుకోడానికి నా నయనాలు ఆదిత్య కోసం వెతికాయ్. బయట చూస్తే ఆదిత్య ఒక్కడే కూర్చున్నాడు. తను నా వైపు చూసి.. నేను సంతోషంగా ఉన్నది చూసి నవ్వాడు కానీ.. తన బాధ కనబడకుండా జాగ్రత్త పడ్డాడు.
ఇంకా ఎవరూ తనని ఈ ఇంటి అల్లుడిగా ఒప్పుకునేందుకు సిద్ధంగా లేరనే భావన తనని బాధిస్తుంది అని స్పష్టంగా కనబడుతుంది. అందరు ఆయన చుట్టే కూర్చున్నారు కానీ ఎవరూ మాట్లాడే ధైర్యం చెయ్యట్లేదు, ఎందుకంటే వారందరికీ నాన్న మాట అంటే అంత గౌరవం. నాన్న గారు వీళ్ళ ముందు మాట్లాడితేగాని.. వీళ్ళెవరూ ఆదితో మాట్లాడే ధైర్యం చేయరు.
ఇటు పక్క కిటికీలోంచి చూస్తే నాన్న ఎంతో హడావిడి గా అన్ని పనులు చూసుకుంటున్నాడు, పెద్ద మామయ్య తోచిన సహాయం చేస్తున్నారు.
కానీ ఎలా? నాన్నని ఎలా అడగను? అందరి ముందు ఆదిత్య ని మన ఇంటి వాడిని చేయమని. ఇదే మనుషుల ముందు ఇంటి బయటకి గెంటేసిన ఆయన మళ్ళీ ఈరోజు అవే కన్నులు చూస్తుండగా అక్కున చేర్చుకుంటారా? ఈ ప్రశ్న నా మనసుని తుడిచేస్తుండగా ఇంటి ల్యాండ్ లైన్ కి ఎవరో ఫోన్ చేసారు.
'నాన్న! మీకే ఫోన్,' స్వాతి వెళ్లి నాన్నను పిలిచింది.
'వస్తున్నా! నేను ఇప్పుడే వస్తున్నా!' నాన్న ఏదో తొందరలో ఉన్నారు.
'ఉమా.. నేను కాస్త త్వరగా వెళ్ళాలి. ఆఫీస్ నుంచి ఏదో ముఖ్యమైన ఫైల్ నాకు ఇవ్వాలట,' నాన్న ఇప్పటివరకు చేసిన పనికి చెమటలు పడుతుండగా కండువాతో మొఖం తుడుచుకుంటూ అమ్మతో అన్నారు.
'అదేంటి? ఈరోజు ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని ఎలా వెళ్తారు? కుదరదు! వాళ్లనే రమ్మనండి, తినేసి వెళ్తారు వాళ్ళు కూడా..' అమ్మ నాన్నకి నచ్చజెప్పడానికి ప్రయత్నించింది.
'అలా కాదు ఉమా, వెళ్లాల్సిందే. ముఖ్యమైనది అంటున్న కదా.' 'సరే వెళ్ళండి. మీరు నా మాట ఎప్పుడు విన్నారని కనుక,' నా ముక్కుపై పడ్డ కుంకుమను తుడుస్తూ అంది అమ్మ.
'సరే వెళ్తాను కానీ..'
'హ, కానీ?'
'అదో రెండు గంటల పని. అప్పటివరకు ఇక్కడ అన్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా..' అన్నారు నాన్న, తన స్కూటర్ తాళాలు షెల్ఫ్ లోంచి తీస్తూ.
'మా అన్నయ్య ఉన్నారు కదా,' అంది అమ్మ.
'బావ, వంట దగ్గర కూర్చున్నాడు. ఒకరు వంట చూసుకోడానికి ఉండాల్సిందే, దానికి మీ అన్నయ్యనే కరెక్ట్. కానీ డబ్బు విషయాలు చూసుకోడానికి మనవాళ్ళు ఎవరైనా ఉంటె..' అన్నారు నాన్న, ఆయన జేబులోంచి ఒక 100 రూపాయిల నోట్ల కట్ట తీసి.
ఆయన చుట్టూ చూస్తూ ఉండగా, నా కళ్ళు ఆదిత్య పైనే ఉన్నాయ్. ఇదే సరైన సమయం అని నాన్న వైపు తిరిగాను. ఆయన కూడా ఆదిత్యని చూసి నా వైపు చూసారు. మౌనంగానే ప్రార్థించాను తనని మన కుటుంబంలో ఒకడిగా చూడమని.
నేను తప్ప నా అనుకునేవారెవరూ లేని ఆదిత్యకి ఈ కుటుంబాన్ని కానుకగా ఇవ్వమని, ఈ కుటుంబానికి ఓ మంచి వ్యక్తిని కానుకగా ఇవ్వమని ఆయన కళ్ళలోకి చూస్తూ మాట మాట్లాడకుండా ప్రాధేయపడ్డాను. నాన్న కూడా ఏం మాట్లాడలేదు. నా కోరికను వరంగా మార్చారు.
ఆదిత్య వైపు చూస్తూ.. చుట్టూ ఉన్న ఆ గోలలో ఆయన గొంతు వినపడటానికి గట్టిగా ఊపిరి తీసుకున్నారు. 'ఆ..' మధ్యలోనే ఆపేసారు. నాన్నగారి గంభీర కంఠానికి ఆయన ఏదో మాట్లాడబోతున్నారని హాల్లోని వారంతా ఒక్క క్షణం మౌనంగా ఉన్నారు.
నాన్న మళ్ళీ నా వైపు చూసి మరో సారి గట్టిగా ఊపిరి తీస్కొని ఆదిత్య వైపు చూస్తూ ‘అల్లుడు..’ అంటూ ఆదిత్యను లోపలకి రమ్మన్నారు. అందరు ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టారు. ఆదిత్యతో సహా. తను ఇప్పటివరకు కూర్చున్న చోటే అలా నించొని ఉన్నాడు.
'నిన్నే, లోపలకి రా అల్లుడు,' మరోసారి పిలిచారు నాన్న. ఆదిత్య పరిగెడుతూ హాల్లోకి వచ్చాడు. 'చెప్పండి మామ్మయ్య!'
'నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకి వెళ్తున్నాను. అప్పటివరకు ఇక్కడి పనులు చూసుకోడానికి మన..' నాన్న ఒక క్షణం ఆలోచించారు తను వాడబోయే పదం గురించి, '..అదే ఇక్కడ పనులు చూసుకోడానికి మనవాళ్ళు ఎవరైనా ఉంటె బాగుంటుంది. అందుకే మీకు అప్పజెపుతున్నాను,' అంటూ నాన్న ఆదిత్య చేతిలో ఆ డబ్బుల కట్ట పెట్టి, తన కంటి అంచు నుంచి నా వైపు ఓ చూపు విసిరారు.
నేను చిరునవ్వుతో ఆనందభాష్పాలు నిండిన అక్షువులతో కృతజ్ఞతలు చెప్పాను. 'జాగ్రత్త. అన్ని చూస్కోండి,' అంటూ బయటకి వెళ్లి బయట కూర్చున్న వాళ్లందరికీ ఆదిత్యకి సహాయం చేయమని చెప్పి వెళ్లిపోయారు. ఇక నాన్నే ఒప్పుకున్నాక అందరు ఎవరికి భయపడతారు.
బాబాయిలు, పిన్నిలు, అత్తయ్యలు, మామయ్యలు, అన్నయ్యలు, అక్కలు, బావలు, వదినలు అందరూ ఆదిత్యని చుట్టుముట్టారు.. తానేదో సినిమా హీరో అన్నట్టుగా. ఆదిత్య కళ్ళలో నీళ్లు తిరిగాయి.
తనను ప్రేమించడం వాళ్ళ నాకు మంచి కుటుంబాన్ని దూరం చేసాడని ఎంతగా భాదపడేవాడో అప్పుడప్పుడు. ఇప్పుడు అదే మంచి కుటుంబంలో తాను ఓ భాగం అయినందుకు చాలా సంతోషపడుతున్నాడు.
నా కళ్ళు గేట్ వైపు మరలాయి. అక్కడ నాన్న తన స్కూటర్ పై కూర్చొని, వాళ్ళందరి వైపు చూసి ఓ చిరునవ్వు నవ్వి వెళ్లిపోయారు. ఇక్కడికి వచ్చాక ఆయన అంత మనస్పూర్తిగా నవ్వింది చూసి నాకెంతో సంతోషం వేసింది.
సాయంత్రం అయింది. అప్పుడే సూర్యుడు కిందికి జారుకున్నాడు. కిటికీలోంచి వీస్తున్న గాలి నా చెంపలపై ఉన్న గంధాన్ని తాకి ముఖాన్ని చల్లబరుస్తుంది. ఇంటికి వచ్చిన ముత్తయిదువులు ఆశీర్వదించి వెళ్లిపోయారు. ఇక చుట్టాలు మరో సారి నన్ను ముద్దాడి వారి ఇళ్ళకి వెళ్ళడానికి రిక్షాలు మాట్లాడుకుంటున్నారు.
పక్కింట్లో వనజ పిన్ని ఏదో వ్రతం చేసింది అంటే ఇక్కడ పనులు అన్ని అయిపోయాక ఇప్పుడు ఖాళీ కుదిరిందని అమ్మ, చెల్లి అక్కడికి వెళ్లారు. పెద్దమామని బస్టాండు దాకా దింపడానికి ఆదిత్య మామయ్యని బండిపై తీసుకెళ్లాడు. అంతమంది ప్రేమ వానలో తడిసిన నేను, పూర్తిగా అలిసిపోయి పొద్దున్నుంచి కట్టుకున్న ఆ ఎర్రటి పట్టుచీర విప్పేసి చల్లగా ఉంటుందని ఏదో కాటన్ చీర కట్టుకుని కుర్చీలో సేదతీరాను.
ఇంత ఘనంగా పండుగ జరిగినా సరే, కేవలం నాన్న నాతో మాట్లాడలేదనే బాధ తప్ప ఇంకే లోటు లేదు నాకు.
ఆ ఆలోచనల్లో ఉండగా, నుదుటిపై కుంకుమ ఎక్కువయింది అని అద్దంలో చూస్తూ కాస్త కుంకుమను దులిపేస్తుండగా, అద్దంలో పై అంచున నా వెనక ఉన్న గడియారం వైపు దృష్టి మళ్లింది.
కాళ్ళు వణకడం మొదలయ్యాయి. ఎందుకంటే అప్పుడు సమయం ఏడున్నర. ఇదేంటి ఇంత జరిగాక కూడా ఇంకా ఎందుకు భయపడ్తున్నాను అని ఎంతో మదనపడుతూ కళ్ళు తిరుగుతుంటే గోడకు ఆనుకొని నిల్చున్నాను. నాన్న స్కూటర్ శబ్దం వినపడింది. గుండె గట్టిగా కొట్టుకుంటుంది.
ఇంతలో కూర్చుని మంచి నీళ్లు తాగాను. అదేంటో అయినా ఒళ్ళంతా భయంతో నిండినట్టు అనిపిస్తుంది. నాన్న లోపలకి వచ్చారు.
ఆనాడు పెళ్లి పత్రికలు పట్టుకున్న చేతిలో ఆయన ఫైల్. నా మెడలో పసుపుతాడుకి బదులు రెండు తులాల తాళి. ఆరోజు జనాలు, అల్లర్లతో నిండిన ఈ ఇల్లు, ఈరోజు సూది కింద పడ్డా కర్ణభేరులు పగిలేంత మౌనంతో నిండింది. అంతే తేడా. కానీ ఆ భయంలో మాత్రం తేడా లేదు.
ఈరోజు నా పక్కన అమ్మ కానీ, ఆదిత్య కానీ తోడుగా కూడా లేరు. 'ఉమా!' నాన్న అమ్మని పిలిచారు, ఫైల్ ని ఆయన గదిలోని షెల్ఫ్ లో పెడుతూ.
'అమ్మ వనజ పిన్ని ఇంటికి వెళ్ళింది నాన్న,' తడారిన గొంతుతో జవాబిచ్చాను. ఆయన నా వైపు చూసి ఏం మాట్లాడకుండా తలూపి బండి తాళాలు షెల్ఫ్ లో పెట్టేసారు.
ఆయన నాకోసం ఇంత చేస్తున్నా ఆ భయం ఎందుకు పోలేదు నాలో అని ఆలోచిస్తూ గట్టిగా ఊపిరి పిలుస్తూ కాసింత శక్తిని కూడగట్టుకొని కాళ్ళు వణుకుతున్నా నించోడానికి ప్రయత్నించాను, కుదరలేదు. పట్టు సడలి పడుతుంటే నాన్న వచ్చి తన రెండు చేతుల్తో నన్ను పట్టుకున్నారు.
ఒక్కసారిగా నాలోని భయమంతా ఆవిరైంది. నడక నేర్చుకున్ననాడు నాన్న వేలు పట్టుకునే మొదటి అడుగు వేసానట, అటువంటి అనుభూతే కలిగింది మళ్ళీ ఇప్పుడు. ఆయన నన్ను పట్టుకుని కూర్చోబెడుతుంటే, ఆయన చేతుల్ని వదలాలనిపించలేదు. ఆయన్ని గట్టిగా పట్టుకున్నాను. ఆయన కూడా అది గ్రహించి కదలకుండా నిల్చొన్నారు.
'క్షమించండి నాన్న!' ఆ చేతులను కళ్ళకు అద్దుకుంటూ ఏడ్చాను, 'క్షమించండి! అర్ధం చేసుకుంటారు అనుకున్నాను కానీ ఇంత శిక్ష వేస్తారని అనుకోలేదు.' గుండెలోని బాధంతా బయటపెట్టాలని అనుకున్నాను. ఆయన మాత్రం మౌనంగా నిల్చున్నారు.
'మూడేళ్లు ఎటువంటి నరకం అనుభవించానో తెలీదు నాన్న మీకు. ప్రతి రోజు మీరే గుర్తొచ్చేవారు. బయట ఎక్కడైనా స్కూటర్ శబ్దం వినబడితే చాలు బాధ, భయం కలగలిపిన ఆందోళన నా మనసుని కమ్మేసేది. కానీ వీటన్నిటికీ కారణం మీరు కాదు నాన్న, నేనే. అర్ధం చేసుకున్నాను. ఇక నా వల్ల కాదు నాన్న. మీకు దూరంగా నేను ఉండలేను. ఇలా మీరంటే భయపడుతూ ఉండలేను. ప్రేమించిన వాళ్ళకి భయపడే దానికంటే పెద్ద నరకం ఉండదు నాన్న. నా తప్పుని క్షమించి మీ కూతురిగా గుర్తించండి నాన్న. మీ కళ్ళలోకి చూడాలన్న ధైర్యం చాలట్లేదు,' అంటూ ఏడుస్తూనే ఉన్నాను.
తన కుడి చేయిని నా చేతుల్లోంచి విడిపించుకున్నారు. ఏంటి ఇంకా కూడా నాన్నకి నన్ను క్షమించాలని లేదా అని బాధపడుతూ ఉండగా, ఆ విడిపించుకున్న చేయి నా తలపై పెట్టి మృదువుగా నిమిరారు. అంతే కన్నీళ్లు ఆగలేవు నాకు. 'నాన్నా!' అంటూ కూర్చునే ఆయన్ని గట్టిగా హత్తుకున్నాను. ఆయన ఇన్నాళ్ల తర్వాత నన్ను తాకారు అనే ఆనందం కూడా నాకు మిగలనీయలేదు.. ఎందుకంటే నేను ఆయన్ని పట్టుకుని ఏడుస్తుండగా, నాన్న తన రెండు హస్తాలను నా చుట్టూ వేసి తన కౌగిట్లో బంధించారు. ఇంకేంటి ఆ క్షణం అలా ప్రాణాలు విడిచినా చాలు అనిపించిందంటే అతిశయోక్తి కాదు. చెమ్మగిల్లిన అక్షువులతో ఆయన వైపు చూడగా మళ్ళీ ఆ కళ్ళలో నాపై ప్రేమ కనబడింది.
'ధన్యవాదాలు నాన్న! చాలా చాలా ధన్యవాదాలు! చివరిగా ఒక్క కోరిక,' కళ్ళు తుడుచుకుంటూ అడిగాను, 'ఈరోజంత అందరి ఆశీర్వాదాలు దక్కాయి నా బిడ్డకు, మీవి తప్ప.'
నాన్న నా వైపు చూస్తూ ఆ కనుల అంచున ఉన్న కన్నీరుని ఆపుకుంటూ చిన్నగా నవ్వి నా ముందు మోకరిల్లారు. ఆయన రెండు చేతులు నా కడుపు పై పెట్టి, 'రేయ్ మనుమడా! నా ఆయుష్షు కూడా కలిపి పోసుకొని బతుకు. మీ అమ్మని..' నాన్న ఒక క్షణం ఆలోచించారు తను వాడబోయే పదం గురించి, '... మరీ ముఖ్యంగా నా కూతురిని బాగా చూసుకో!' అంటూ ఆయన నా కడుపుని ముద్దాడారు.
నన్ను పట్టుకొని ఏడుస్తూ కూర్చున్నారు, 'క్షమించు అమ్మా! నువ్ కష్టపడ్డంత నన్ను కష్టపెట్టకు. ఇప్పుడే క్షమించేయ్! ఎందుకంటే నేను నా కూతురంత ధైర్యశాలిని కాదు..' అని ఏడ్చారు.
ఇద్దరం నవ్వుకుంటూ మొదటిసారి ప్రేమగా ఒకరి కళ్ళలోకి మరొకరం చూసుకోగలిగాం. నాన్న నా కడుపుపై తల పెట్టగానే బిడ్డ తన్నింది. ఒక్కసారిగా నేను ఆనందంతో ఆశ్చర్యపోయాను. నాన్న అయితే ఏకంగా ఏడ్చేశారు. నాన్న నేను ఒకరినొకరు హత్తుకొని ఇన్నాళ్ల ప్రేమని ఆనందభాష్పాల రూపంలో పంచుకున్నాం.
డెలివరీ రూమ్ లోకి తీసుకెళ్లారు. నొప్పి కంటే బాధే ఎక్కువయింది.
ఇంత ప్రేమ చూపెట్టిన నాన్న అంత మోసం ఎలా చేయగలిగాడు అని. అంత నమ్మశక్యంగా ఎలా నటించాడు అని. కూతురిని ప్రేమించే మాట అటు ఉంచితే కూతురిని ద్వేషించే వాడు కూడా చేయలేనిది చేసాడు. బయట చూస్తే అమ్మ, చెల్లి ఏడుస్తూ భయంభయంగా నిల్చున్నారు.
నాన్నే గనక అక్కడ ఉండుంటే ఆపరేషన్ బెడ్ పై నుంచి కిందకు దిగి మెడ పట్టుకుని, ఆయన చెవులు పగిలేలా అడిగేదాన్ని 'ఎందుకు నాన్నా? నన్నెందుకు మోసం చేసావ్ నాన్నా!'
(ఈ కథ పార్ట్-2 చదవడానికి ఉడాన్ వారి తర్వాతి ఎడిషన్ కోసం వేచి చూడండి)